కుండపోత వర్షం
నెల్లూరు(అర్బన్): జిల్లాపై మోంథా తుపాను చూపిన ప్రభావానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ ప్రభావం నుంచి తేరుకునేలోపు జిల్లాపై దిత్వా ప్రభావం చూపింది. గత నెల 29 నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ప్రభావం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అయితే ఆదివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. సోమవారం తీరప్రాంత మండలాల్లో భారీ వర్షాలు నమోదు కాగా, మెట్టప్రాంత మండలాల్లో మోస్తరుగా కురిశాయి. తుపాను ప్రభావంతో సముద్రం కసురు మీద ఉంది. అలలు ఎగిసి పడుతున్నాయి. పలుచోట్ల సముద్రం నాలుగైదు మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొచ్చింది. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. చలివాతావరణం ఎక్కువగా ఉంది. సోమవారం తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఫలితంగా తుపాన్ ప్రభావం కొంతమేర తగ్గింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో సోమవారం జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికలను రద్దు చేశారు. రాష్ట్రం నుంచి వచ్చిన జిల్లా ప్రత్యేకాధికారి యువరాజ్ పర్యవేక్షణలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయిఅధికారులతో ఎప్పటికప్పుడు చర్చి స్తూ ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్య లు చేపట్టారు.
పొంగుతున్న వాగులు
తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పలు చోట్ల వాగులు పొంగాయి. చేజర్ల మండలంలోని నల్లవాగుకు ప్రవాహం పెరగడంతో యనమదల, తూర్పుకంభంపాడు, తూర్పుపల్లి తదితర ఐదు గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. పొదలకూరు మండలంలోని నావూరు వద్ద పెద్ద వాగుకు నీటి ప్రవాహం పెరిగింది. బొగ్గేరు, బీరాపేరులకు మోస్తరుగా వరద ప్రవాహం పెరిగింది. విడవలూరు మండలం మలిదేవి డ్రెయిన్, పైడేరులకు నీటి ప్రవాహం పెరిగింది. ఇప్పటికే చెరువులు నిండి ఉండడంతో ఎక్కడ తెగిపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు నగరంలోని లోత ట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
వ్యవసాయ పనులకు ఆటంకం
జిల్లాలోని రైతులు రబీ సాగు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పొలాల నిండా నీరు చేరడంతో వేసిన నాట్లు, నారుమళ్లు కుళ్లిపోతాయోమోనని ఆందోళన చెందుతున్నారు. ముసురుతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడడంతో వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.
నేడూ వర్షాలు కొనసాగే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది నెమ్మదిగా కదులుతూ నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 12 గంటల్లో మరింత బలహీన పడి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మంగళవారం కూడా వర్షాలు కురవనున్నాయి. ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి.
బలహీనపడి వాయుగుండంగా మారిన దిత్వా తుపాన్
పొంగిన వాగులు, వంకలు
పెన్నానదిలో పెరిగిన ప్రవాహం
మునిగిన నారుమళ్లు, నాట్లు
ఆందోళనలో అన్నదాతలు
వ్యవసాయ పనులకు ఆటంకం
మూతపడిన పాఠశాలలు, కళాశాలలు
కోవూరులో అత్యధికంగా 136.4 మి.మీ. వర్షపాతం
జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం 5గంటల వరకు పడిన వర్షపాతం వివరాలను పరిశీలించగా కోవూరులో అత్యధికంగా 136.4 మి.మీ. వర్షం నమోదైంది. కావలిలో 135.2, బుచ్చిరెడ్డిపాళెం 131.6, సంగం 129.8, బోగోలు 116.8, జలదంకి 115.0, దగదర్తి 105.6, అల్లూరు 106.2, పొదలకూరు 102.2, నెల్లూరు అర్బన్ 102.2, కొడవలూరు 100.2, ఆత్మకూరు 97.6, ఏఎస్‌పేట 96.0, రాపూరు 93.6, నెల్లూరు రూరల్ 93.4, విడవలూరు 88.2, చేజర్ల 78.8, కలువాయి 78.2, అనంతసాగరం 67.6, సైదాపురం 65.6, ఇందుకూరుపేట 57.8, కందుకూరు 51.8, ఉలవపాడు 51.6, కలిగిరి 49.6, గుడ్లూరు 43.4, వెంకటాచలం 70.8, తోట పల్లిగూడూరు 43.4, ఉదయగిరి 29.4, మనుబోలు 41.8, వలేటివారిపాళెం 25.6, ముత్తుకూరు 38.8, మర్రిపాడు 22.0, కొండాపురం 20.4, వింజమూరు 21.0, లింగసముద్రం 12.6, దుత్తలూరు 11.6, వరికుంటపాడు 10.4, సీతారామ పురం 5.8 మి.మీ చొప్పున కురిసింది.


