గంజాయి గ్యాంగ్ ఇళ్లు ధ్వంసం
నెల్లూరు సిటీ: సీపీఎం నేత పెంచలయ్య హత్యకు కారకులైన గంజాయి గ్యాంగ్ అరవ కామాక్షి, ఆమె అనుచరుల ఇళ్లను సీపీఎం కార్యకర్తలు, స్థానికులు సోమవారం రాత్రి ర్యాలీగా వెళ్లి ధ్వంసం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఆర్టీడీ కాలనీలో కామాక్షి, జేమ్స్, మరికొందరు నివాసం ఉంటున్నారు. అదే కాలనీకి చెందిన పెంచలయ్య పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తుండగా హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద అడ్డుకుని కత్తులతో అతికిరాతకంగా నరికి చంపారు. ఈ నేపథ్యంలో ఆర్టీడీ కాలనీలో ఆలయ అభివృద్ధికి దోహదపడుతూ గంజాయిపై పోరాటం చేస్తున్న మంచివ్యక్తి పెంచలయ్యను గంజాయి గ్యాంగ్ పొట్టన పెట్టుకోవడంపై స్థానికులకు కడుపు మండింది. పెంచలయ్య హత్యకు గురైన రోజే కామాక్షి ఇంటికి నిప్పుపెట్టారు. ఆదివారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన నేపథ్యంలో సోమవారం రాత్రి గంజాయి గ్యాంగ్ ఇళ్లను కూల్చివేసి తమ కోపాన్ని తీర్చుకున్నారు.
శ్రీవారి దర్శనానికి
పది గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


