ఆరోగ్య భద్రత కోసమే ‘కోటి సంతకాలు’
● కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
బిట్రగుంట: ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించడంతోపాటు పేద విద్యార్థులకు వైద్యవిద్యను అందించే లక్ష్యంతోనే వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టినట్లు కావలి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశ్వనాథరావుపేట మేజర్ పంచాయతీలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రామిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. ప్రైవేట్‌పరం చేయడం ద్వారా ప్రజారోగ్యం ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంటుందన్నారు. జవాబుదారీతనం లోపించడంతోపాటు పేదల వైద్య ఖర్చులు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రజలంతా కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు, నాయకులు ఏకే సుందర్‌రాజు, దొడ్ల నకుల్‌రెడ్డి, డేవిడ్, సుక్కు మధు, దేవరకొండ వరుణ్, ఏసుపాదం, సుధాకర్, కిరణ్‌కుమార్, చిన్ని, తదితరులు పాల్గొన్నారు.


