ఖండిస్తే.. ప్రశ్నిస్తే చంపేస్తారా?
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): అధికారంలో ఉన్న వ్యక్తు లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆధారాలతో ప్రశ్నిస్తే.. టీడీపీ నేతల దాష్టీకాలను ఖండిస్తే ఏకంగా కత్తులతో పొడిచి చంపేస్తారా అంటూ మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిలదీశారు. దీని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసన్నారు. ఆదివారం రాత్రి టీడీపీ నాయకుల విచక్షణారహిత దాడిలో తీవ్రంగా గాయపడి నెల్లూరు అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ బదనాపురి గోపాల్‌ను సోమవారం కాకాణి పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాకాణి మాట్లాడుతూ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన గోపాల్ వైఎస్సార్‌సీపీ తరఫున తన గొంతును బలంగా వినిపించడాన్ని స్థానిక టీడీపీ నేతలు తట్టుకోలేక అర్ధరాత్రి అతనిపై దాడి చేసి హతమార్చే ప్రయత్నం చేశారన్నారు. టీడీపీ నేతల దాడిలో గోపాల్ గొంతు దగ్గర 12 సెంటీ మీటర్ల మేర గాయమైందన్నారు. గోపాల్ కళ్లేదుటే ఆయన భార్యను గొంతు పట్టుకుని దుండగులు హింసించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ దాడిని ఖండించారన్నారు.
అర్ధరాత్రి ఇళ్లల్లోకి చొరబడి ఇంత దారుణమా?
అర్ధరాత్రి పూట ఇళ్లల్లోకి దూరి నిద్రపోతున్న వారిపై నిర్భయంగా దాడుకు పాల్పడుతున్నారంటేనే శాంతి భద్రతలు పరిస్థితి ఎలా ఉందో ఉహించుకోవచ్చన్నారు. సోమి రెడ్డి ముఠా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి బూడిద తరలిస్తున్న బల్కర్ల నుంచి రూ.300 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని, చంద్రబాబు విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. అక్రమ వసూళ్లపై మాట్లాడితే సోమిరెడ్డి తన వంధిమాగాధులతో విమర్శలు చేయిస్తున్నారన్నారు. స్థాయికి మించి విమర్శలు చేయొద్దని గోపాల్ టీడీపీ నేతలకు సూచించడం తప్పా అని ప్రశ్నించారు. దీంతో రమేష్ అనే వ్యక్తి గోపాల్ కుటుంబ సభ్యులను బెదిరించాడని, ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నారని భావించారే తప్ప హత్య చేసేంత వరకు తెగిస్తారని గోపాల్ కుటుంబ సభ్యులు భావించ లేదన్నారు. చంద్రబాబు పరిపాలనలో ఏ వర్గానికి రక్షణ లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. గోపాల్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు.
కేసు తారుమారుకు సోమిరెడ్డి ఒత్తిడి
గోపాల్‌పై దాడి ఘటనకు సంబంధించి బెయిల్‌బుల్ సెక్షన్లతో అనామకులపై కేసులు నమోదు చేయాలని సోమిరెడ్డి పోలీసు అధికారులపై ఒత్తిడి చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఈ కేసును మరో రకంగా మార్చేందుకు కూడా కుట్రలు చేస్తున్నారన్నారు. ఎస్పీ ఈ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు.
ప్రజాస్వామ్యంలో ఇంత బరితెగింపా
సోమిరెడ్డి అక్రమ వసూళ్లను
ప్రశ్నించడమే నేరమా
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి


