మద్యం దుకాణానికి రీ నోటిఫికేషన్
నెల్లూరు (క్రైమ్): కావలి నియోజకవర్గంలోని బోగోలు పరిధిలో గెజిట్ సీరియల్ నంబర్ 59 మద్యం దుకాణానికి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు సోమవారం రీ నోటిఫికేషన్ జారీ చేశారు. నేటి నుంచి ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామనీ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి (డీపీఈఓ) ఎ. శ్రీనివాసులునాయుడు తెలిపారు. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలని తెలిపారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాల్లో లాటరీ తీసి షాపును కేటాయించడం జరుగుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు కావలి ఎకై ్సజ్ కార్యాలయంలో సంప్రదించాలని శ్రీనివాసులునాయుడు సూచించారు.
నీట్ విద్యార్థులకు
ఉచిత శిక్షణ
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకొన్న విద్యార్థులకు నీట్ కోచింగ్ పొందాలనుకునే వారికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ జిల్లా సమన్వయ అధికారిణి డాక్టర్ సి.ప్రభావతమ్మ సోమవారం ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఈ అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
డ్రగ్ కంట్రోల్ ఏడీ
బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(అర్బన్): జిల్లా ఔషధ నియంత్రణ శాఖ (డ్రగ్ కంట్రోలర్) నూతన ఏడీగా హరిహరతేజ సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ తరఫున పలువురు నాయకులు కలిసి శాలువాలు కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. హరిహరతేజ మాట్లాడుతూ డాక్టర్ల ప్రిస్కిప్షన్ మేరకే మందులివ్వాలన్నారు. మందులు కొనుగోలు చేసిన వారికి బిల్లులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పేరూరి ప్రదీప్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి నరేంద్ర, అశోక్, భాస్కర్, లీలామోహన్, పవన్, పాండు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
తీరంలో భద్రతకు
పటిష్ట చర్యలు తీసుకోవాలి
● డీఐజీ గోపీనాథ్‌జెట్టి
నెల్లూరు (క్రైమ్): మైపా డు బీచ్‌లో ఆదివారం ఈతకెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందారని, ఇలాంటి దురదృష్ట ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్నీ చర్యలు తీసు కోవాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ, మైరెన్ ఇన్‌చార్జి అధికారి గోపీనాథ్‌జెట్టి సోమవారం టెలికాన్ఫరెన్స్‌లో మైరెన్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నెల 5వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 21 మైరెన్ పోలీసు స్టేషన్ల పరిధిలోని అన్నీ బీచ్‌ల వద్ద తగినంత పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. సముద్ర స్నానానికి వచ్చే సందర్శకులు పోలీసు అధికారుల సూచనలు పాటించాలన్నారు. మోంథా తుఫాన్ కారణంగా బీచ్‌ల్లో ఎక్కడకక్కడ గుంతలు ఏర్పడి ప్రమాదవశాత్తు మునిగిపోయే అవకాశం ఉందని, సముద్ర స్నానాలకు వచ్చే సందర్శకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి
8 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,442 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 24,692 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.51 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ చెబుతోంది.
మద్యం దుకాణానికి రీ నోటిఫికేషన్


