పోలీసులూ కూటమికి దాసోహం కావొద్దు
● నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆగ్రహం
కోవూరు: ప్రజల రక్షణ కోసం ఉన్న పోలీసులు రాజకీయ నాయకుల బానిసలుగా మారడం విచారకరమని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసులు తమ బాధ్యతలను మరిచి, రాజకీయ ఆజ్ఞలకే తల వంచుతూ పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తున్నారన్నారు. సోమవారం కోవూరులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ప్రసన్న మీడియాతో మాట్లాడుతూ తన ఇంటి మీద టీడీపీ రౌడీ మూకలు, కార్యకర్తలే దాడి చేశారని స్పష్టంగా పోలీసులకు తెలిసినా.. గుర్తు తెలియని వ్యక్తులు చేశారంటూ కేసునే తారుమారు చేశారని మండిపడ్డారు. చివరకు తనపైనే తప్పుడు కేసు నమోదు చేశారని, ఇది ఎక్కడి న్యాయమని నిలదీశారు. ప్రజలు ప్రతి విషయం గమనిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పటికై నా న్యాయమే గెలుస్తుందన్నారు. అధికార మదంతో పనిచేస్తున్న కొంత మంది అధికారులు భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పోలీసులు ప్రభుత్వానికి కాదు, రాజ్యాంగానికి విధేయులుగా ఉండాలని గుర్తుంచుకోవాలన్నారు.


