
28న కోవూరులో భారీ ప్రదర్శన
● నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
కోవూరు: ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేస్తాం. ఈనెల 28వ తేదీన కోవూరులో భారీ ప్రదర్శన జరుగుతుంది’ అని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ కోవూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం గురువారం నెల్లూరులోని ప్రసన్న నివాసంలో జరిగింది. దీనికి కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లు, సీనియర్ నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి పదవుల్లో ఉన్న వారు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా సమస్యలు, రాబోయే కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు చెప్పారు. పేదలు, మధ్య తరగతి కుటుంబాల కోసం విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి వైద్య విద్యను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఆ కాలేజీలను ప్రైవేట్‌పరం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. పేదలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదన్నారు. ప్రజలు, విద్యార్థులు, భవిష్యత్ తరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ముమ్మరం చేస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక పేదలకు ఆనందం కరువైందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని చెప్పారు. ప్రజలకు ఉపాధి, భద్రత లభించడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చెరిపేయాలని ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 28వ తేదీన కోవూరు మండలంలో చేపట్టే భారీ ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు.