
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటం ఆగదు
● సంక్షేమ పథకాల అమలు అస్తవ్యస్తం
● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ముత్తుకూరు(పొదలకూరు): మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటాన్ని తమ పార్టీ కొనసాగించనుందని, సంక్షేమ పథకాలు పేదలకు అందేంత వరకు ఉద్యమాలను చేస్తూనే ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. ముత్తుకూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో గురువారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అంటూ ప్రచారం చేసిన టీడీపీ శ్రేణులు ఇప్పుడు ప్రజలకు ముఖం చూపలేకపోతున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాలను తొలి ఏడాది ఎగ్గొట్టి.. తర్వాతి ఏడాది అరకొరగా అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సర్వీసులను పెంచకుండా ఉచిత బస్సుల పేరిట ప్రజలకు నరకం చూపుతున్నారని చెప్పారు. నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన 17 మెడికల్ కళాశాలల్లో పదింటిని విక్రయించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం నుంచి నవంబర్ 22 వరకు కోటి సంతకాలను సేకరించనున్నామని వెల్లడించారు.
కల్తీ మద్యంపై
సోమిరెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం
కల్తీ మద్యం మూలాలు కూటమి ప్రభుత్వంలో బయటపడుతుంటే.. తమపై బురదజల్లేందుకు సోమిరెడ్డి యత్నించడం దారుణంగా ఉందని కాకాణి విమర్శించారు. ఆయనకు డబ్బులిస్తే దేనికై నా సై అంటారని, గతంలో తనపై మోపిన కల్తీ మద్యం కేసుపై సీబీఐ విచారణ వేయించేందుకు సిద్ధమానని ప్రశ్నించారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబును ఇదే విషయమై అసెంబ్లీలో తాను కోరానని గుర్తుచేశారు. కల్తీ మద్యం బయటపడిన కేసులో కూటమి నేతలే ప్రధాన సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్‌కు అత్యంత సన్నిహితులే ప్రధాన పాత్రను పోషించారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమి నేతలు కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిపై విచారణ జరిపిస్తామని తెలిపారు. కృష్ణపట్నంలో టెర్మినల్‌ను తెప్పిస్తానన్న సోమిరెడ్డి ఎంత దూరం తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. పార్టీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, నెల్లూరు శివప్రసాద్, ఎంపీపీ గండవరపు సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.