
పొగాకు పంట నియంత్రణ పాటించాలి
● పొగాకు బోర్డు చైర్మన్
చిడిపోతు యశ్వంత్‌కుమార్
కందుకూరు: అంతర్జాతీయ పొగాకు మార్కెట్‌లో అధిక నిల్వలు ఉన్నాయని, ఈ ఏడాది మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని, బోర్డు పరిమితి మేరకే పంట సాగు చేయాలని పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్ సూచించారు. కందుకూరులోని 1, 2వ పొగాకు వేలం కేంద్రాల్లో శనివారం ఆయన రైతులకు అవగాహన సద స్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పొగాకు పండించే దేశాల చైనా, బ్రెజిల్, జింబాంబ్వే, టాంజానియా వంటి దేశాల్లో వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల అధిక పొగాకు పండిందన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉండే అవకాశం లేదన్నారు. రైతులు అధిక ధరలకు పొలాలు, బ్యారన్‌లు కౌలుకు తీసుకుని నష్టపోవద్దని సూచించారు. బోర్డు సూచించిన విస్తీర్ణంలోనే పొగాకు పంటను సాగు చేయడం వల్ల మార్కెట్ బాగుంటుందని వివరించారు. వేలం నిర్వహణాధికారులు ఎం కిరణ్, చంద్రశేఖర్ మాట్లాడుతూ మార్కెట్‌కు అనుగుణంగా రైతులు పొగాకు సాగులో నియంత్రణ పాటించాలన్నారు. నాణ్యమైన పొగాకు పండిస్తే మంచి ధరలు వస్తాయని చెప్పారు. పొగాకులో పొటా షియం వాడకం పెంచడం వల్ల కొంత హైగ్రేడ్ పొగాకు దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. పొగాకు మండెల మీద ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండే సామర్థ్యం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఓ రాజగోపాల్ బోర్డు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.