
పీహెచ్‌సీల్లో ఓపీ సేవలు బంద్
అగచాట్లు
నెల్లూరు(అర్బన్): రోగులతో పాటు డాక్టర్లపై కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోవడంతో గతేడాది డాక్టర్లు ఇదే తరహాలో సమ్మెకు పిలుపునివ్వడంతో, చర్చలు జరిపింది. పలు హామీలిచ్చినా, అందులో ఏ ఒక్కటీ నేటికీ పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు సోమవారం నుంచి బంద్ అయ్యాయి.
ఇదీ పరిస్థితి..
సాధారణంగా కొన్ని పీహెచ్‌సీల్లో 50 నుంచి 60.. మరికొన్ని చోట్ల 70 మంది వరకు రోగులకు ఓపీ సేవలందేవి. అయితే డాక్టర్లు సమ్మెబాట పట్టడంతో పలు ప్రాంతాల్లో ఇది 20కి పడిపోయింది. తొలి రోజే ఇలా ఉంటే రెండో రోజు నుంచి ఆస్పత్రులు ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఎమర్జెన్సీ సేవలను సైతం నిలిపేస్తామని వైద్యులు స్పష్టం చేశారు.
ఇవీ డిమాండ్లు..
● 20 నుంచి 25 ఏళ్లుగా ఉద్యోగోన్నతుల్లేక ఒకే హోదాలో సేవలందిస్తున్న వైద్యాధికారులకు టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలి.
● ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించేలా జీఓ నంబర్ 99ను రద్దు చేయాలి.
● నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలి.
● గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూల వేతనాన్ని గిరిజన భత్యంగా మంజూరు చేయాలి
● చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.ఐదు వేల భత్యాన్ని ఇవ్వాలి.
● స్థానికత్వం, పట్టణ వైద్యాధికారుల సర్వీస్ అర్హత సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్ అంశాలకు పరిష్కారం చూపాలి.
వైద్యమందక రోగుల అవస్థలు
పలు చోట్ల డాక్లర్ల అవతారమెత్తిన నర్సులు
అవసరమైతే ఎమర్జెన్సీ సేవలనూ నిలిపేస్తామని ప్రకటన
జిల్లాలోని 52 పీహెచ్‌సీల్లో ఓపీ సేవలను డాక్టర్లు నిలిపేశారు. కొన్ని చోట్ల డాక్టర్లు హాజరైనా, కుర్చీలు ఖాళీ చేసి పక్కకు వెళ్లిపోయారు. మరికొన్ని చోట్ల అసలు వైద్యులే రాకపోగా.. పలు ప్రాంతాల్లో ఆస్పత్రిలో డాక్టర్లున్నా రోగుల వైపు చూడలేదు. విషయం తెలియక హాస్పిటళ్లకు వచ్చిన పలువురు నిరుపేద రోగులు వైద్యమందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి పరిస్థితిని చూసి కొన్ని చోట్ల నర్సులే డాక్టర్ల అవతారమెత్తారు. ఏదో తూతూమంత్రంగా నాలుగు మాత్రలిచ్చి పంపారు.

పీహెచ్‌సీల్లో ఓపీ సేవలు బంద్