
సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవ ర్యాలీ
● అధికారిక వాట్సాప్ గ్రూపు నుంచి
వైదొలిగిన వైనం
● ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు
నెల్లూరు(అర్బన్): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని సచివాలయ ఉద్యోగులు కదం తొక్కారు. నగరంలోని వీఆర్సీ గ్రౌండ్స్ నుంచి కలెక్టరేట్ వరకు ప్లకార్డులు చేతబట్టి భారీ ప్రదర్శనను సోమవారం నిర్వహించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ల జేఏసీ నేతలు సతీష్‌రెడ్డి, బాలు, పాండురంగ మాట్లాడారు. ఉన్నత చదువులను అభ్యసించి ఎంతో ఆశతో సచివాలయ ఉద్యోగాల్లో చేరామని, తమ సమస్యలను సర్కార్ నెరవేర్చకపోయినా, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తున్నామని చెప్పారు. తమ మెడపై కత్తిపెట్టి వలంటీర్ల విధులను చేయిస్తున్నారని ఆరోపించారు. ఇంటింటి సర్వేను చేయాలనడం తగదని, ప్రత్యామ్నాయం చూడకుండా తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. తమ సమస్యలపై ఉన్నతాధికారులకు వినతిపత్రాలను తరచూ ఇస్తున్నా, ప్రయోజనం లేకపోవడంతో నిరసన బాట పట్టామని వివరించారు. ప్రభుత్వ తీరు మారకపోవడంతో అఽధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలిగామని చెప్పారు. రెండు నోషనల్ ఇంక్రిమెంట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తొమ్మిది నెలల అరియర్స్‌ను చెల్లించడంతో పాటు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నేతలు చైతన్య, గోపాల్, మురళీకృష్ణ, రాజేశ్, శశి, సురేష్, బాలాజీనాయక్, ఫయాజ్, అబీద్, సుమన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.