
హామీలను విస్మరిస్తున్న ప్రభుత్వం
కోవూరు: కౌలు రైతులకు నూతన చట్టాన్ని తీసుకురావడంతో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని అందిస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన టీడీపీ, అధికారంలోకి వచ్చాక విస్మరించిందని కౌలు రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణయ్య ఆరోపించారు. పడుగుపాడులోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘ జిల్లా నాలుగో మహాసభను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ముత్యాల గురునాథం, కార్యదర్శిగా తుళ్లూరు గోపాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 27 మంది సభ్యులతో నూతన జిల్లా కమిటీ, తొమ్మిది మంది ఆఫీస్ బేరర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం రాధాకృష్ణయ్య మాట్లాడారు. గుర్తింపు కార్డులను ఇవ్వకపోవడంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. సమయానికి యూరియాను అందించాలని గురునాథం డిమాండ్ చేశారు. అనంతరం వివిధ అంశాలపై తీర్మానం చేశారు. రైతు సంఘ నేత చండ్ర రాజగోపాల్, సీఐటీయూ నేత ప్రసాద్, రెహనాబేగం తదితరులు పాల్గొన్నారు.