
అధికారుల తీరు మారాలి
నెల్లూరు (పొగతోట): ‘వివిధ శాఖల అధికారుల పని తీరు మారాల్సిన అవసరం ఉంది. గతంలోనే నిధులు కేటాయించి టెండర్లు ఖరారు చేసిన ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణంలో నిర్లక్ష్యం చేయడం ఎంత వరకు సబబు. మంజూరు చేసిన భవన నిర్మాణాలు, మరమ్మతులు పూర్తి చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతుంది. భవనాలను పరిశీలించి మరమ్మతుల కోసం ఎస్టిమేషన్లు వేసింది మీరే కాదా? అదే పనులు చేయడానికి వీలుకాదంటున్నారు. జిల్లాలో అంగన్‌వాడీ భవనాలు ఎందుకు నిర్మించడం లేదు’ అంటూ జెడ్పీ చైర్ పర్సన్ అధికారుల తీరుపై అసహసం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో చైర్ పర్సన్ అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్‌లో హెల్పర్లు ఉండగా విద్యార్థులతో పనులు చేయించడం ఏమిటని విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. ఇకపై విద్యార్థులతో ఎక్కడైన పనులు చేసినట్లు తెలిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన ‘విజయ దీపిక’ను సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీ గెస్ట్‌హోస్ టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంజూరు చేసిన పనుల విషయం పట్టించుకోరు, నిలిచిపోయిన పనులపై ప్రతి సమావేశంలో చర్చిస్తారు.. ఇదేక్కడి పరిస్థితి అని నిలదీశారు.
అనేక భవనాలు అసంపూర్తిగానే ఉన్నాయి
గ్రామీణ ప్రాంతాల్లో గతంలోనే నిధులు మంజూరు చేసి ప్రారంభించిన గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్‌లు, బల్క్‌మిల్క్ సెంటర్ భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఆయా భవనాలను పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరం అయితే జెడ్పీ నుంచి నిధులు కేటాయిస్తామన్నారు. మంచినీటి సరఫరాకు సంబంధించి మోటార్లు, బోర్ల మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జెడ్పీ సమావేశాలకు తప్పని సరిగా జిల్లా అధికారులు హాజరు కావాలన్నారు. అనుమతి లేకుండా అధికారులు హాజరుకాకపోతే ఇకపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అంగన్‌వాడీ భవన నిర్మాణాలు, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం జెడ్పీ నిధులు అడుగుతున్నారు. నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నాం.. ప్రారంభోత్సవాలకు మాత్రం ఆహ్వానించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తరచూ ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కేంద్రం ఇస్తున్న నిధులతో గర్భిణులకు శ్రీమంతాలు, బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నారన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు తప్పని సరిగా జెడ్పీటీసీ సభ్యులను ఆహ్వానించాలని సూచించారు. అంతకముందు గృహ నిర్మాణం, డీఆర్‌డీఏ, డ్వామా, పరిశ్రమలు, ఏపీ సీడ్స్, ఐటీడీఏ తదితర శాఖలతో సమీక్షించారు. స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ సీఈఓ మోహన్‌రావు, జెడ్పీటీసీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా..
జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, జెడ్పీటీసీ సభ్యులు బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సభ్యులందరూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
గతంలో ప్రారంభించిన పనులు
పూర్తి చేయడానికి ఏమిటి ఇబ్బందులు
అంగన్‌వాడీ భవనాలు ఎందుకు నిర్మించడం లేదు
ఆగిన భవన నిర్మాణాలకు పంచాయతీ, మండల పరిషత్, జెడ్పీ నిధులు
పదేపదే ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై సీరియస్
విద్యార్థులతో పనులు చేయించడం ఏమిటి?
సకాలంలో విజయదీపికను సిద్ధం చేయండి
సమావేశాలకు జిల్లా అధికారులు
కచ్చితంగా హాజరుకావాలి
స్థాయీ సంఘ సమావేశాల్లో
జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ