
రైతులకు న్యాయవాదుల అండ
● కరేడులో ఐలు బృందం పర్యటన
● న్యాయ పోరాటం చేస్తాం
ఉలవపాడు: భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కరేడు రైతులకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) మద్దతు ఉంటుందని ఐలు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం న్యాయవాదుల బృందం కరేడు ప్రాంతంలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ అక్రమంగా రైతుల భూములు లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే యూనియన్ అండగా ఉంటుందన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వం ఉద్యమాన్ని అణచలేవన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వాలే కూలిపోతాయన్నారు. విజనరీకి ఆ మాత్రం తెలియదా అన్నారు. భూగర్భ సంపదను దోచుకోవడానికి ప్రయత్ని స్తున్నారనే అనుమానం కలుగుతుంది.
న్యాయ సహాయం అందిస్తాం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐలు అధ్యక్షులు నర్రాశ్రీనివాసరావు మాట్లాడుతూ 18 వేల మందికి జీవనాధారమైన భూములను తీసుకోవడం న్యాయం కాదన్నారు. కరేడు రైతులకు న్యాయ సహాయం అందిస్తామన్నారు. కుగ్రామాలన్నీ తిరిగి భూము లు పరిశీలించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కార్యక్రమంలో ఐలు రాష్ట్ర కార్యదర్శి యన్. మాధవరావు, ఏపీ వైస్ ప్రసిడెంట్ వి కోటేశ్వరరావు, సెక్రటేరియట్ ప్రెసిడెంట్ రమేష్, ఐలు నాయకులు రాజారత్నం, కిరణ్‌బాబు, అహ్మద్, వినోద్‌కుమార్, చీరాల బార్ అసోసియేషన్ నాయకులు గొట్టి ప్రసాద్, నెల్లూరు బార్ అసోసియేషన్ నాయకులు రమేష్, సాయికుమార్, బండా శ్రీనివాసులు, ఐ శ్రీనివాసులుతోపాటు పౌర హక్కుల సంఘ నాయకులు, వామపక్షాలు, సీఐటీయూ నాయకులు ఉన్నారు.