
అస్తవ్యస్తంగా బదిలీలు
నెల్లూరు (అర్బన్): ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో పశుసంవర్థక శాఖలో సహాయకులకు సంబంధించిన బదిలీల కౌన్సెలింగ్‌ను జరపకుండా అస్తవ్యస్తం చేశారని పలువురు ఆరోపించారు. ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రాన్ని సోమవారం అందజేసిన అనంతరం ఏహెచ్‌ఏ శ్రీనివాసులు మాట్లాడారు. రైతు సేవా కేంద్రాల్లో ఏహెచ్‌ఏలుగా ఆరేళ్లుగా పనిచేస్తున్నామని చెప్పారు. బదిలీలకు సంబంధించిన నోటిఫికేషన్ గత నెల్లో వచ్చిందని, అయితే తమ శాఖలో కనీసం కౌన్సెలింగ్ జరగలేదన్నారు. ప్లేస్‌మెంట్ ఆప్షన్లనూ అడగలేదన్నారు. జిల్లా అధికారులకు అనుకూలంగా ఉన్న వ్యక్తులనే దగ్గరగా బదిలీ చేశారని తెలిపారు. కొంత మందిని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు సుమారు 200 కిలోమీటర్ల దూరానికి బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొబేషన్ డిక్లేర్ చేయని వారిని కూడా బదిలీ చేసి సీనియార్టీ ఉన్న వారికి అన్యాయం చేశారని, ప్రక్రియను రద్దు చేసి విచారణ జరపాలని కోరారు.
ప్రధానోపాధ్యాయుడిపై దాడి
దగదర్తి: కట్టుబడిపాళెం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై అక్కడే పనిచేసి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయురాలు ప్రమీల, ఆమె భర్త ప్రసాద్ సోమవారం దాడి చేశారు. వివరాలు.. ధ్రువీకరణ పత్రాల కోసం పాఠశాలకు ఆమె వచ్చారు. ఎల్పీసీ పత్రాలను అందించి.. ఎస్సార్‌ను నాలుగు రోజుల తర్వాత ఇస్తానని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. దీంతో ఆగ్రహించిన ప్రసాద్ ఆయనపై దాడి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.