
రీ కౌన్సెలింగ్ వద్దంటూ ఆందోళన
నెల్లూరు(అర్బన్): సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న తమకు బదిలీల విషయంలో రీ కౌన్సెలింగ్‌ను నిర్వహించొద్దని గ్రేడ్ – 3 ఏఎన్‌ఎంలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నాను సోమవారం నిర్వహించిన అనంతరం జేసీ కార్తీక్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గ్రేడ్ – 3 ఏఎన్‌ఎం అసోసియేషన్ జిల్లా నేతలు జయలక్ష్మి, వాణి మాట్లాడారు. గ్రేడ్ – 3 నుంచి గ్రేడ్ – 2కు ఉద్యోగోన్నతి పొందిన ఏఎన్‌ఎంలు వారికి కేటాయించిన సబ్ సెంటర్లకు వెళ్లకుండా సచివాలయాల పరిధిలోనే ఉన్నారని చెప్పారు. సచివాలయాల పరిధిలో ఖాళీలు చూపొద్దని అధికారులను ఒత్తిడి చేసే సరికి, తమకు రీ కౌన్సెలింగ్‌ను నిర్వహించి వేరే మండలానికి కేటాయిస్తామని చెప్పడం అన్యాయమన్నారు. ఇదే జరిగితే తాము తీవ్రంగా నష్టపోతామని పేర్కొన్నారు. పదోన్నతి పొందిన వారిని సబ్ సెంటర్లకు బదిలీ చేయాలని, అలా కాని పక్షంలో కౌన్సెలింగ్‌ను రద్దు చేసి తాము ఇప్పుడు పని చేస్తున్న ప్రదేశంలోనే ఉంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రక్రియను తాము అంగీకరించేదిలేదని స్పష్టం చేశారు.