
కార్లు ఢీకొని.. రోడ్డు పక్కకు దూసుకెళ్లి
● బస్సు కోసం నిరీక్షిస్తున్న వ్యక్తిని కబళించి
దుత్తలూరు: కార్లు ఢీకొని.. బస్సు కోసం నిరీక్షిస్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని నందిపాడు కూడలిలో గల జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బండిపై గోలీ సోడాను విక్రయిస్తూ నందిపాడుకు చెందిన నల్లబోతుల వెంకటేశ్వర్లు (54) జీవనం సాగిస్తున్నారు. ఈ తరుణంలో ఉదయగిరి వెళ్లేందుకు గానూ బస్సు కోసం నందిపాడు సెంటర్‌లో రోడ్డు మార్జిన్‌లో వేచి ఉన్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి తిరుపతి వెళ్తున్న కారు ఉదయగిరి నుంచి సంగానికి వెళ్తున్న కారును ఢీకొని రోడ్డు పక్కన ఉన్న వెంకటేశ్వర్లు.. ఆపై గృహాలపైకి దూసుకెళ్లాయి. ప్రమాదంలో గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని విలపించారు. సమాచారం అందుకున్న ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. పోస్ట్‌మార్టం నిమి త్తం ఉదయగిరి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కార్ల యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

కార్లు ఢీకొని.. రోడ్డు పక్కకు దూసుకెళ్లి