
మంత్రుల మధ్య మంటలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: షోడో సీఎం లోకేశ్ సమక్షంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరో మంత్రి నారాయణపై బహిరంగంగా విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. నగరంలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థయిన వీఆర్ హైస్కూల్ పునః ప్రారంభోత్సవ వేదికపై నుంచి ఆ పాఠశాలను మున్సిపల్ హైస్కూల్‌గా మార్పు చేయడంపై వచ్చిన మంత్రి లోకేశ్ సమక్షంలో తీవ్ర స్వరంతో దుయ్యబట్టారు. ఇదే పాఠశాలను మంత్రి నారాయణ కృషి, పట్టుదలతో రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారని లోకేశ్ ప్రశంసించారు. వాస్తవానికి నెల్లూరులో శతాబ్దాల కాలం నాటి చరిత్ర ఉన్న వీఆర్సీ విద్యాసంస్థలపై మంత్రి నారాయణ ఆధిపత్యం చెలాయించడం మరో మంత్రి రామనారాయణరెడ్డికి కంటగింపుగా మారింది. ఎన్నో ఏళ్లగా వీఆర్సీ విద్యాసంస్థల మేనేజ్‌మెంట్ కమిటీని ఆనం కుటుంబం హస్తగతం చేసుకొని పెత్తనం చెలాయిస్తోంది. తమ నుంచి తాజాగా మంత్రి నారాయణ లాక్కోవడం వారికి రుచించడం లేదు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే వీఆర్సీ విద్యా సంస్థలపై మంత్రి నారాయణ కన్ను పడింది. అప్పట్లోనే వీఆర్ జూనియర్ కాలేజ్ అంటూ పెత్తనం లాక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో మేనేజ్‌మెంట్ కమిటీపై న్యాయ స్థానంలో వ్యాజ్యం వేయించి రద్దు చేసేలా చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాకతో ఈ వ్యవహారం మరుగున పడింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాకతోనే మళ్లీ నారాయణ వీఆర్ విద్యాసంస్థలపై పెత్తనం ప్రారంభించారు. నారాయణ సంస్థల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే అమరావతి రాజధానితోపాటు అల్లూరుకు చెందిన బడా కాంట్రాక్టర్ల కంపెనీల నుంచి దాదాపు రూ.15 కోట్ల సీఎస్సార్ ఫండ్స్ సేకరించి హైస్కూల్‌ను పునద్ధరణ చేయించారు. ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. నగర వాసుల్లో ఏదో అభివృద్ధి చేస్తున్నట్లు చూపిస్తూ వెనుక నుంచి వీఆర్సీ విద్యా సంస్థలను గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. వాస్తవంగా న్యాయ స్థానంలో పెండింగ్‌లో ఉన్న ఎయిడెడ్ పాఠశాలను మున్సిపల్ పరిధిలోకి చేర్చడం పెద్ద వివాదమే. చట్టవిరుద్ధంగా మంత్రి నారాయణ వీఆర్సీ విద్యాసంస్థల్ని మున్సిపల్ శాఖ పరిధిలోకి తెచ్చారు. ఎలాంటి తీర్మానాలు లేకుండానే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని మంత్రి నారాయణ కార్పొరేట్ సంస్థలాగా మార్చేశారు. ఆ హైస్కూల్‌లో అడ్మిషన్ల నుంచి టీచర్స్ సెలక్షన్ వరకు అన్నింట్లోనూ మంత్రి పెత్తనం చేయడాన్ని మంత్రి ఆనం సహించలేకపోయారు. దశాబ్దాలుగా తమ అధీనంలో ఉన్న సంస్థలను బలవంతంగా నారాయణ లాక్కోవడం రుచించలేదు. మంత్రి లోకేష్ సమక్షంలోనే మంత్రి నారాయణ తీరును ఎండ గట్టడం పెద్ద దుమారమే రేపింది. రూ.వేల కోట్లకు అధిపతిగా ఉన్న మంత్రి నారాయణ తన సంస్థల నుంచి ఒక్క రూపాయి కూడా ఇందులో పెట్ట లేదని మంత్రి ఆనం బహిరంగంగానే విమర్శలు చేయడంతోపాటు ముందు నీ సంస్థ నుంచి ఖర్చు పెట్టమని సలహా ఇవ్వడం పెద్ద చర్చనీయాంశమైంది.
నారాయణపై ‘ఆనం’ ఆగ్రహం
వీఆర్ విద్యాసంస్థలపై
ఆయన పెత్తనమేమిటి..?
కార్పొరేట్ కంపెనీల సీఎస్సార్ ఫండ్‌తో అభివృద్ధి చేసి తనఖాతాలో
వేసుకోవడంపై మండిపాటు
మంత్రి సంస్థ నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదంటూ ఘాటైన విమర్శలు
మంత్రి లోకేశ్ సాక్షిగా
బట్టబయలైన విభేదాలు