
ఆరోగ్య సమస్యలు తాళలేక..
● యువకుడి బలవన్మరణం
నెల్లూరు(క్రైమ్): ఆరోగ్య సమస్యలు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. డ్రైవర్స్ కాలనీలో శైలజ, శివకోటాచారి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు మంజునాఽథ్ (25) కొయ్యపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతను కొంతకాలంగా ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకుంటున్నా ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. రెండురోజుల క్రితం శైలజ, శివకోటాచారి చైన్నెలోని కుమార్తె ఇంటికెళ్లారు. మంజునాథ్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. సోమవారం జ్వరం కారణంగా అతను పనికి వెళ్లలేదు. శైలజ కుమారుడికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె పక్కింట్లో ఉంటున్న వినయ్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. అతను ఇంటికి వెళ్లిచూడగా మంజునాఽథ్ బెడ్‌రూమ్‌లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెంది ఉండటాన్ని గమనించాడు. ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశాడు. బాధిత తండ్రి శివకోటాచారి మంగళవారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారులను సంరక్షించి..
నెల్లూరు(క్రైమ్): రొట్టెల పండగ సందర్భంగా పోలీసు అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సోమవారం అర్ధరాత్రి భారీ బందోబస్తు నడుమ గంధ మహోత్సవం జరిగింది. కాగా తప్పిపోయిన 42 మంది చిన్నారులను పోలీసులు సంరక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్రైమ్ పార్టీ పోలీసులు ముగ్గురు జేబుదొంగల్ని అదుపులోకి తీసుకుని నగదు, బ్యాగ్‌లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. మంగళవారం ఏఎస్పీ సీహెచ్ సౌజన్య భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
నెల్లూరు కాలువలో
మృతదేహం
నెల్లూరు సిటీ: నెల్లూరు కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. రూరల్ మండల పరిధిలోని జొన్నవాడ కూడలి వద్ద నెల్లూరు కాలువలో సుమారు 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడి వివరాలు లభ్యం కాలేదు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అతను ఆరురోజుల క్రితం చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కండలేరులో
31.397 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 31.397 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2,300, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 70, హైలెవల్ కాలువకు 70, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.