
బలవంతపు భూసేకరణను అడ్డుకుంటాం
కందుకూరు: కరేడు గ్రామ రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండా బలవంతంగా భూములు లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరేడు పరిధిలో 8,800 ఎకరాల భూములను తీసుకోవడంతోపాటు, 16 గ్రామాల ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. చట్ట ప్రకారం గ్రామసభ నిర్వహించి 80 శాతం మంది గ్రామస్తులు ఆమోదిస్తేనే భూసేకరణ చేయాలనే నిబంధన ఉన్నా కనీసం రైతుల అభిప్రాయాలకు విలువ ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండో సోలార్ కంపెనీకి గతంలో రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో భూములు కేటాయించారని, అయినా కూడా ఆ పరిశ్రమను ప్రస్తుతం కరేడు వైపు మార్చడంలో ఉన్న ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదన్నారు. దొనకొండ, పామూరు వద్ద నిమ్జ్‌కు కేటాయించిన భూములు అనేకం ఉన్నాయని వాటిల్లో ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు.
పక్క రాష్ట్రాలకు చెందిన వారికే ఉద్యోగాలా?
పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రజలకు భ్రమ కల్పిస్తున్నారని, ఎటువంటి ఉద్యోగాలు రావడం లేదని శ్రీనివాసరావు అన్నారు. ఎక్కువ శాతం ఉద్యోగాలు పక్క రాష్ట్రాలకు చెందిన వారికే దక్కుతున్నాయని, భూములు కోల్పోతున్న వారికి రావడం లేదన్నారు. ఇప్పటికే ఇండో సోలార్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1,800 కోట్ల వరకు సబ్సిడీల రూపంలో వచ్చాయన్నారు. గతంలో కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
నేడు దేశవ్యాప్త సమ్మె
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు బ్రోకర్లుగా మారి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని తీవ్రంగా శ్రీనివాసరావు విమర్శించారు.
కార్మికుల హక్కులను కాపాడేందుకు బుధవారం దేశవ్యాప్తంగా జరిగే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, కార్యదర్శివర్గ సభ్యుడు కె.అజయ్‌కుమార్, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు ప్రాంతీయ కమిటీల కార్యదర్శులు జి.వెంకటేశ్వర్లు, జీవీబీ కుమార్, ఎస్‌ఏ గౌస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు
కొమ్ము కాస్తోంది
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు