
రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న జయలక్ష్మి
నెల్లూరు (బృందావనం): నగరంలోని దర్గామిట్టలో కొలువైన శ్రీరాజరాజేశ్వరి అమ్మవారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలన ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జి.జయలక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆమెను దేవస్థానం ఈఓ కోవూరు జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో సంప్రదాయంగా ఆహ్వానించారు. దేవస్థానం ప్రాంగణంలోని మీనాక్షీసుందరేశ్వరస్వామి వారిని దర్శించుకొన్నారు. అమ్మ వారికి ఖడ్గమాల పూజ చేయించారు. అనంతరం అర్చకులు వేదమంత్ర ఆశీర్వచనాలతో శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా జయలక్ష్మి దృష్టికి దేవదాయశాఖ భూమిని వెబ్‌ల్యాండ్‌లో అప్‌డేషన్ జరిగేలా రెవెన్యూ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఈఓ జనార్ధన్‌రెడ్డి కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందిస్తూ తగిన ఆదేశాలు ఇస్తామని తెలిపారు. దేవస్థానం పక్కన ఉన్న రెవెన్యూ భూమి నుంచి కొంత స్థలం దేవస్థానానికి కేటాయిస్తే.. పార్కింగ్‌కు ఎటువంటి సమస్యలు తలెత్తవనే విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. ఆమె వెంట నెల్లూరు ఆర్డీఓ అనూష ఉన్నారు.
ఉల్లాసంగా, ఉత్సాహంగా రెవెన్యూ క్రీడలు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 10వ రెవెన్యూ క్రీడలను మూడో రోజు ఆదివారం రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్, ప్రత్యేక రెవెన్యూ కార్యదర్శి జి.జయలక్ష్మి ప్రారంభించారు. మూడో రోజు ఆటలు ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగాయి. తొలుత కలెక్టర్ ఓ ఆనంద్‌తో కలిసి ఇండోర్ స్టేడియంలో కలెక్టరేట్ టీం, డివిజన్ టీం మధ్య జరిగిన బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు. మహిళా విభాగంలో అండర్–35 100 మీటర్ల పరుగు పందెంలో గెలుపొందిన సాహిత్య, అనూష, శాంతిప్రియలకు మొదటి మూడు బహుమతులను కలెక్టర్ ఆనంద్‌తో కలిసి అందజేశారు. షాట్‌ఫుట్, డిస్కస్‌త్రో, జావెలిన్‌త్రో, లాంగ్‌జంప్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హుస్సేన్‌సాహెబ్, ఆర్డీఓలు అనూష, అవని, వంశీకృష్ణ, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎం పెంచలరెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నటుడు ‘కోట’కు
సింహపురితో అనుబంధం
నెల్లూరు (బృందావనం): తెలుగు చలన చిత్ర రంగంలో విభిన్న పాత్రలను అలవోకగా పోషించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని విలక్షణ నటుడిగా కీర్తిప్రతిష్టలందుకొన్న కోట శ్రీనివాసరావుకు నెల్లూరుతో అనుబంధం ఉంది. నటుడిగా ప్రస్థానం సాగిస్తున్న తొలి రోజుల్లో పురమందిరంలో నెఫ్జా సుందరరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నెఫ్జా నాటక కళాపరిషత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1995లో నెల్లూరు పొదలకూరురోడ్డులో సుమన్, సౌందర్య నటీనటులుగా నెల్లూరీయుడు శ్రీధర్‌రెడ్డి నిర్మాతగా నిర్మించిన ‘బాలరాజు బంగారుపెళ్లాం’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ఆ చిత్రం షూటింగ్ పొదలకూరురోడ్డు, పొగాకు గోడౌన్, నెల్లూరు పరిసరాల్లో జరుపుకొంది. దాదాపు 10 రోజుల పాటు ఆ చిత్ర నిర్మాణం నెల్లూరులో జరిగింది. ప్రతిఘటన చిత్రంతో స్టార్‌డమ్ అయిన తర్వాత కోట నెల్లూరుకు మళ్లీ ఎన్నడూ రాలేదని సమాచారం.
గంజాయి కేసులో
వ్యక్తి అరెస్ట్
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: ఓ వ్యక్తి దగ్గర గంజాయి ఉందన్న స్థానికుల సమాచారంతో ఆదివారం పోలీసులు దాడి చేశారు. అతని వద్ద నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు రూరల్ మండలానికి చెందిన మస్తాన్ బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడ సమీపలో పెన్నానది బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం అందడంతో ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడి వద్ద 1.3 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తహసీల్దార్ వద్ద హాజరు పరిచి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న జయలక్ష్మి