
హత్య కేసులో నిందితుల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన
కావలి డీఎస్పీ శ్రీధర్
ఉదయగిరి: ఆస్తి వివాదంలో షేక్ హమీద్ అనే వ్యక్తిని హత్య చేసిన నిందితులు షేక్ గుంటుపల్లి మహ్మద్ హనీఫ్, షేక్ గుంటుపల్లి మహ్మద్ ఉమర్‌ను గురువారం అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. ఉదయగిరిలోని ఆల్‌ఖైర్ ఫంక్షన్ హాలు భాగస్వామ్యానికి సంబంధించి ఆర్థిక లావాదేవీల విషయంలో హమీద్‌తో నిందితులకు రెండేళ్ల నుంచి విభేదాలున్నాయి. నెల్లూరు కోర్టులో హనీఫ్ దాఖలు చేసిన సివిల్ కేసు నడుస్తోంది. ఈనెల 11వ తేదీ సాయంత్రం హమీద్ తన బావమరిది, మరికొందరు కలిసి ఫంక్షన్ హాలు తలుపులకు తాళం వేశారు. ఈ విషయం తెలుసుకున్న హనీఫ్, ఉమర్‌లు హమీద్‌ను చంపి హాలును సొంతం చేసుకోవాలాని ప్లాన్ చేశారు. స్కూటీపై అక్కడికెళ్లి హనీఫ్ కత్తితో, ఉమర్ ఇనుపరాడ్డుతో హమీద్‌పై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హతుడి తండ్రి షేక్ ఇమాంగారి ఖాజామొహిద్దీన్ 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ పర్యవేక్షణలో ఉదయగిరి సీఐ ఎన్.వెంకట్రావు, ఎస్సైలు కర్నాటి ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టారు. వారికి వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బందితో దుత్తలూరు మండలం వెంకటంపేట హుస్సేని బీఈడీ కాలేజీ వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డు, కత్తి, ఇంకా సెల్‌ఫోన్లు, పారిపోయేందుకు ఉప యోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు కృషి చేసిన ఎస్సైలు, సిబ్బంది హనుమంతరావు, ఎం.గోవిందు, బి.ప్రసన్నకుమార్, కె.అశోక్, కె.ప్రసాద్, ప్రశాంత్, ఎ.ప్రభాకర్, ఎన్.ఉమేష్, ఎ.నరసింహారావు, ఎస్‌కే ఖాజాపీర్‌ను డీఎస్పీ అభినందించారు.
ముందు వెళ్తున్న
వాహనాన్ని ఢీకొట్టి..●
● డ్రైవర్ మృతి
దగదర్తి: మండలంలోని సున్నపుట్టి జాతీయ రహదారి సమీపంలో జామాయిల్ ఫారెస్ట్ వద్ద నెల్లూరు వైపు వెళ్తున్న మినీ కంటైనర్ గురువారం గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ ముందు భాగం దెబ్బతినడంతో డ్రైవర్ పన్నీర్ సెల్వం (50) తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న దగదర్తి పోలీసులు హైవే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. హైవేపై ట్రాఫిక్ నిలిచిపోకుండా వెంటనే చర్యలు చేపట్టారు. సెల్వంను అంబులెన్స్‌లో నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు.
కోడూరు కాలువలో
మృతదేహం
తోటపల్లిగూడూరు: మండలంలోని చింతోపు పంచాయతీ ఆంజనేయపురం సమీపంలో ఉన్న కోడూరు కాలువలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు తోటపల్లిగూడూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడి వయసు సుమారు 35 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. వంగపూత కలర్ షర్ట్ ధరించి ఉన్నాడు. ఎడమ చేతిపై మల్లీశ్వరి అని పచ్చబొట్టు ఉంది. మృతదేహాన్ని నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్