
సురేష్‌కుమార్‌రెడ్డికి ముందస్తు బెయిల్
నెల్లూరు (లీగల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బచ్చలపల్లి సురేష్‌కుమార్‌రెడ్డికి కండిషన్లతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ గూడూరు ఏడో అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వెంకటనాగపవన్ ఉత్తర్వులను గురువారం జారీ చేశారు. గత ఎన్నికలకు ముందు పొదలకూరు మండలం విరువూరులో అక్రమ మద్యం నిల్వలను ఉంచారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ తరుణంలో ముందస్తు బెయిల్ కోరుతూ తన న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి ద్వారా గూడూరు ఏడో అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు ఉన్న న్యాయమూర్తి షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేశారు. రూ.పది వేల చొప్పున ఆస్తి కలిగిన ఇద్దరితో పూచికత్తు ఇవ్వడంతో పాటు పోలీసుల విచారణకు సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జెడ్పీ సర్వసభ్య
సమావేశం నేడు
నెల్లూరు (పొగతోట): జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 10.30కు నిర్వహించనున్నామని సీఈఓ మోహన్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అఽధ్యక్షతన నిర్వహించనున్న సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారని చెప్పారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ, డ్వామా, డీఆర్డీఏ, జిల్లా విద్యా, విద్యుత్ శాఖలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారని వివరించారు. జెడ్పీ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు హాజరుకావాలని కోరారు.
ఉపాధ్యాయులు,
ఉద్యోగుల ధర్నా నేడు
నెల్లూరు (టౌన్): సీపీఎస్ అమల్లోకి రాక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియమితులైన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నాను శుక్రవారం నిర్వహించనున్నామని డీఎస్సీ – 2003 ఉపాధ్యాయుల ఫోరమ్ జిల్లా కన్వీనర్లు సుబ్బయ్య, ప్రసాద్, ఉస్మాన్, భాస్కర్, కృష్ణ, విశ్వనాథ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు ముంందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఈ విషయంలో తాత్సారం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆర్థిక మోసాలపై
అవగాహన అవసరం
నెల్లూరు రూరల్: ఆర్థిక మోసాలపై అవగాహన కలిగి ఉండాలని ఆర్బీఐ సీజీఎం సుబ్బయ్య పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో అవగాహన సమావేశాన్ని యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో హుస్సేన్ సాహెబ్ మాట్లాడారు. ఆర్థిక మోసాల నుంచి ఎలా కాపాడుకోవాలనే అంశాలపై అవగాహన సదస్సులను ఆర్బీఐ నిర్వహిస్తోందని చెప్పారు. అనంతరం సుబ్బయ్య మాట్లాడారు. మొబైల్ ఫోన్‌కు వచ్చే గుర్తుతెలియని లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయొద్దని సూచించారు. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930, బ్యాంక్ సేవల్లో లోపాలపై ఫిర్యాదులను టోల్ ఫ్రీ నెంబర్ 14448కు తెలియజేయొచ్చని ఆర్బీఐ డీజీఎం కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. ఎల్డీఎం మణిశేఖర్, ఆర్బీఐ ఏజీఎం బాలతేజ, యాక్సిస్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీతాసింగ్, వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.