మేమింతే.. మారమంతే.. | - | Sakshi
Sakshi News home page

మేమింతే.. మారమంతే..

Jul 18 2025 4:56 AM | Updated on Jul 18 2025 4:56 AM

మేమింతే.. మారమంతే..

మేమింతే.. మారమంతే..

ఎమ్మెల్యే చుట్టమని ఒకరు.. ఆయన మా దగ్గరి బంధువు, ఇప్పుడే ఫోన్‌లో మాట్లాడాను. మా జోలికొస్తే మీ ఇష్టమని మరొకరు. ఇదీ మండలంలోని మాచవరం పీహెచ్‌సీ అధికారుల తీరు. విధులు సక్రమంగా నిర్వర్తించకుండా కింది స్థాయి సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా మేము మారేది లేదంటూ విధులకు డుమ్మా కొడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

ఇష్టారాజ్యంగా విధులకు వస్తున్న డాక్టర్లు

సమయపాలన పాటించని

యూడీసీ, సీహెచ్‌ఓ

లంచం ఇస్తేనే బిల్లులు

చేస్తామంటున్న యూడీసీ

హెల్త్‌ క్లినిక్‌కు ఇచ్చే మెయింటెనెన్స్‌

నుంచి రూ.4 వేలు వసూలు

ఎమ్మెల్యే బంధువులమంటూ

బెదిరింపులు

సాక్షి, టాక్స్‌ఫోర్స్‌: కందుకూరు మండలంలో మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. 19 పంచాయతీలకు గానూ 13 సచివాలయాలు ఈ పీహెచ్‌సీ కింద ఉన్నాయి. 13 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లున్నాయి. వీరందరికీ పీహెచ్‌సీ డాక్టర్లే వైద్యం అందించాల్సి ఉంది. మాచవరం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న కందుకూరు మండలంలోని గ్రామాలతోపాటు గుడ్లూరు మండలానికి చెందిన పరకొండపాడు, దప్పళంపాడు, గుళ్లపాళెం, దారకానిపాడు, ఉలవపాడు మండలం కింద ఉన్న బద్దిపూడి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. 24 గంటల పనిచేసే పీహెచ్‌సీలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ఓపీలో ఉండాలి. ఇద్దరు డాక్టర్లు ఉండగా ఒకరు పీహెచ్‌సీలో ఓపీలో ఉండి రోగులను పరీక్షించాలి. మరొకరు 104 వాహనంలో వెళ్లాలి. కానీ రోజూ ఇద్దరిలో ఒకరు మాత్రమే ఆస్పత్రికి వస్తారు. మరొకరు డుమ్మా కొడతారు. విధుల్లో ఉన్న వ్యక్తే 104, పీహెచ్‌సీలో ఉన్నట్లు సిబ్బంది కవర్‌ చేస్తుంటారు. జి.మేకపాడులో జరిగే 104కి ఏడాది నుంచి ఒక్కసారి కూడా డాక్టర్‌ వెళ్లిన దాఖలాల్లేవని లేవని గ్రామస్తులు చెబుతున్నారు.

సాకులు చెబుతూ..

ఇక యూడీసీ రోజూ ఒంగోలు నుంచి వచ్చి వెళ్తుంటారు. వాస్తవానికి 9 నుంచి 4 గంటల వరకు విధుల్లో ఉండాలి. కానీ ఆమె పీహెచ్‌సీకి వచ్చే సమయం 11 గంటల తర్వాతే. ఇంకా రాలేదని ఎవరైనా ప్రశ్నిస్తే ట్రెజరీకి వెళ్లానని సాకులు చెబుతారు. కాసేపు మాత్రమే విధుల్లో ఉండి త్వరగా వెళ్లిపోతారు. ఏఎన్‌ఎంలు, అధికారులు పదవీ విరమణ చేసినా, బదిలీపై వెళ్లినా, పదోన్నతి పొందినా, సబ్‌ సెంటర్లకు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లకు బిల్లుల విషయంలో లంచం ఇవ్వాల్సిందేననే ఆరోపణలున్నాయి. వసూలు చేసిన సొమ్ములో కొంత మొత్తాన్ని డాక్టర్లకు కూడా ఇస్తున్నట్లు ప్రచారం ఉంది. కొందరికి బిల్లులు చేయకపోవడంతో ఇప్పటికీ పీహెచ్‌సీ చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం.

ఆర్‌ఎంపీల వద్ద వసూళ్లు

కందుకూరు మండలం, పట్టణ పరిధిలో ఉండే ఆర్‌ఎంపీలు అనుమతి లేకుండా వైద్యం చేస్తున్నారని ఓ వైద్యుడు బెదిరించాడు. డబ్బులు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. దీంతో రెండునెలలపాటు ఆర్‌ఎంపీలందరూ కలిసి నగదు వసూలు చేసి డాక్టర్‌కు ఇచ్చారు. తర్వాత కొందరు ఇవ్వలేదు. వారిపై డాక్టర్‌ వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో చేసేది లేక ఆర్‌ఎంపీలు ఎమ్మెల్యేను కలిశారు. ఆ సమయంలో వైద్యుడిని ఎమ్మెల్యే మందలించినట్లు సమాచారం. కాగా విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ మెయింటెనెన్స్‌కు ఏడాదికి రూ.10 వేలు ఇస్తారు. అందులో సుమారు రూ.4 వేలు డాక్టర్‌, యూడీసీ వసూలు చేసినట్లు తెలిసింది.

విధుల్లో లేకుండా..

సీహెచ్‌ఓ, పీహెచ్‌ఎన్‌, హెచ్‌వీ, సూపర్‌వైజర్లు వారి విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఆరోపణలున్నాయి. ఫీల్డ్‌లోకి వెళ్లాల్సిన హెచ్‌వీ, సూపర్‌వైజర్లు కింది స్థాయి సిబ్బందిపై పెత్తనం చేయడమే గానీ ప్రజలకు వైద్యం అందుతుందా? లేదా? అని పర్యవేక్షించడం లేదని చెబుతున్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో పని చేయించాల్సిన అధికారులు ఆ వైపు చూడటం లేదు. సిబ్బంది ఫేస్‌ రికగ్నిషన్‌ హాజరు వేయాలి. డాక్టర్లు, కింది స్థాయి అధికారుల అండ ఉంటే ఎక్కడ ఉండైనా హాజరు వేసుకోవచ్చు. లేకపోతే ఆప్సెంట్‌ పడుతుంది. కావాలనే ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు ఆప్సెంట్లు వేసి జీతాలు కట్‌ చేసిన సంఘటనలున్నాయి. ఫేస్‌ రికగ్నిషన్‌ హాజరు లేని వారు కచ్చితంగా జీపీఆర్‌ఎస్‌తో కూడిన ఫొటోను గ్రూపుల్లో పెట్టాలి. లేకపోతే ఆరోజు వారికి ఆప్సెంట్‌ వేసి జీతం కట్‌ చేస్తున్నారు. ఇలా సిబ్బంది అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాలను ఎవరైనా ఉన్నతాధికారులకు చెబితే కక్ష సాధింపునకు దిగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement