
కాకాణిపై ఆగని కక్షసాధింపు
● తాజాగా మరో అక్రమ కేసు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వ కక్షసాధింపులు ఆగడంలేదు. ఇప్పటికే పలు కేసులను మోపి వేధిస్తూ పైశాచికానందాన్ని పొందుతోంది. తాజాగా మరో అక్రమ కేసును తెరపైకి తీసుకొచ్చింది. గత ప్రభుత్వ హయాం 2021లో రెవెన్యూ అధికారుల తప్పిదాలపై నమోదైన భూ రికార్డుల మార్పిడి కేసులో ఈయన్ను నిందితుడిగా చేర్చడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
జరిగిందిదీ..
వెంకటాచలం మండలం కాకుటూరు రెవెన్యూ పరిధిలో ఆర్టీసీ జోనల్ కళాశాల ఎదురుగా సర్వే నంబర్లు 81 / 1, 2, 3, 5, 427లో 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 14.14 ఎకరాలను పట్టా భూమిగా మార్చేశారు. విషయం తెలుసుకున్న అప్పటి రెవెన్యూ అధికారులు వెంటనే విచారణ జరిపారు. వెంకటాచలం తహసీల్దార్ లాగిన్‌ను హ్యాక్ చేసి, గుడ్లూరు మండల డీటీ కీ ద్వారా ప్రవేశించి రికార్డులను తారుమారు చేశారనే అంశాన్ని గుర్తించారు. ఈ వ్యవహారంలో జిల్లా ఉన్నతాధికారులకు అప్పటి తహసీల్దార్ సమాచారం తెలియజేసి, వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆ ఏడాదిలోనే కేసు నమోదు చేశారు. భూ రికార్డుల తారుమారులో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని అధికారులకు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
ప్రశ్నించడాన్ని తట్టుకోలేక..
కూటమి సర్కార్ కొలువుదీరాక అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నిస్తుండటాన్ని ప్రభుత్వ పెద్దలు తట్టుకోలేకపోయారు. ఆయన గొంతు నొక్కే కుట్రల్లో భాగంగా కేసులపై కేసులు మోపుతూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే భూముల రికార్డుల మార్పిడి కేసులో కాకాణిని నిందితుడిగా చేర్చారనే ప్రచారం జిల్లాలో జరుగుతోంది.