
మంత్రి మాటలు నీటిమూటలేనా..?
నెల్లూరు నగరం నలువైపులా విస్తరిస్తోంది. సింహపురికి వలసొచ్చే వారి సంఖ్యా నానాటికీ పెరుగుతోంది. ఈ తరుణంలో భవనాలను ఎడాపెడా నిర్మించేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా అంతస్తులనూ నిర్మిస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండ ఉందనే ధీమాతో పలువురు యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన నగరపాలక సంస్థ అధికారులు తమకెందుకులేననే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వీరి ఆగడాలు శ్రుతిమించుతున్నాయి.
నెల్లూరు(బారకాసు): మినీబైపాస్ చుట్టుపక్కల ప్రాంతాలు రోజుకోజుకూ అభివృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా అక్కడ అపార్ట్‌మెంట్లు, షాపింగ్ మాళ్లు వెలిశాయి. ఈ తరుణంలో బహుళ అంతస్తుల భవనాలను అక్రమంగా నిర్మించి ఎంత దోచుకుందామాననే రీతిలో పలువురు వ్యవహరిస్తున్నారు.
వ్యవహారమిలా..
టీడీపీ కార్యాలయ సమీపంలో ఐదెకరాల్లో ఓ లేఅవుట్‌ను గతంలో అనధికారికంగా వేశారు. దీనికి నుడా నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదు. పైగా ఇందులో ఇరిగేషన్‌కు చెందిన 30 సెంట్ల స్థలం ఆక్రమణకు గురైందని సంబంధిత శాఖాధికారులే నిర్ధారించి కలెక్టర్‌కు నివేదికనూ అందజేశారు. అయినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అదునుగా భావించిన సదరు లేఅవుట్ యజమాని ప్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇలా కొనుగోలు చేసిన వారు అందులో భవన నిర్మాణాలను ప్రారంభించారు. ప్రస్తుతం సదరు లేఅవుట్లో అపార్ట్‌మెంట్లు పదుల సంఖ్యలో వెలిశాయి. మరికొన్ని నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి.
దిక్కుతోచక.. తలలు పట్టుకుంటూ..
అనధికార లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నేడు నిర్మాణాలను సాగించాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కన్‌స్ట్రక్షన్ జరిపిన కొందరు ప్రస్తుతం ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల పలుకుబడి ఉన్న వారు మాత్రం తాము ఏదోలా మేనేజ్ చేసుకోగలమనే ధీమాతో ఉన్నారు.
అంతులేని నిర్లక్ష్యం
వాస్తవానికి ప్లాన్ మంజూరు చేయించుకొని అనధికార లేఅవుట్లో అపార్ట్‌మెంట్లను నిర్మించినా, వాటిపై చర్యలు చేపట్టే హక్కు కార్పొరేషన్ అధికారులకు ఉంది. ఇలాంటివి పదుల సంఖ్యలో ఉన్నా, చర్యలకు వెనుకాడుతున్నారు. ఒకవేళ అక్రమ నిర్మాణమని తెలిసిన వెంటనే పరిశీలించి పునాదుల స్థాయిలోనే నిలిపేయాలి. అలా కాకుండా చివరి వరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి.. నిర్మాణాలు పూర్తయ్యాక పరిశీలన నిమిత్తం వస్తున్నారు. ఆపై అనుమతి ఉందా.. లేకపోతే చర్యలు తప్పవంటూ బెదిరింపులకు దిగుతున్నారు. హైడ్రా వంటి చర్యలకు నగరపాలక సంస్థ అధికారులు ఉపక్రమిస్తే తప్ప ఇలాంటి ఆగడాలకు అడ్డుకట్ట పడే అవకాశం లేదు.
అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు
నగరపాలక సంస్థ పరిధిలో అనుమతుల్లేకుండా భవనాలను అక్రమంగా నిర్మిస్తే చర్యలు తప్పవు. మినీబైపాస్‌లోని టీడీపీ కార్యాలయ సమీపంలో అనధికారికంగా లేఅవుట్‌ను ఏర్పాటు చేసిన వేసిన మాట వాస్తవమే. ఇందులో నిర్మాణాలు జరిపిన వారికి నోటీసులను జారీ చేశాం. చార్జిషీట్లనూ ఫైల్ చేశాం. లేఅవుట్‌కు సంబంధించిన వ్యవహారం కోర్టులో జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు చేపడుతూనే ఉన్నాం.
– నందన్, కమిషనర్, నగరపాలక సంస్థ
అనధికార లేఅవుట్లో భవన నిర్మాణాలు
ప్రజాప్రతినిధుల అండతో బరితెగిస్తున్న పలువురు యజమానులు
చర్యలకు వెనుకాడుతున్న అధికారులు
సింహపురిలో ఇదీ తంతు
అక్రమ నిర్మాణాలు, అనధికార లేఅవుట్లపై చర్యలు తప్పవని.. కూల్చేందుకై నా వెనుకాడబోమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పలు సందర్భాల్లో గతంలో స్పష్టీకరించారు. అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇదంతా ఒట్టిదేననే అంశం బహిర్గతమవుతోంది. నగరపాలక సంస్థ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే మాత్రం నామమాత్రపు చర్యలకే పరిమితమవుతున్నారు. సంబంధిత యజమానుల నుంచి ముడుపులు పుచ్చుకొని మౌనవ్రతం వహిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు.

మంత్రి మాటలు నీటిమూటలేనా..?

మంత్రి మాటలు నీటిమూటలేనా..?