రేషన్‌ షాపుల్లో బినామీల బాగోతం | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ షాపుల్లో బినామీల బాగోతం

Jul 9 2025 7:32 AM | Updated on Jul 9 2025 7:32 AM

రేషన్

రేషన్‌ షాపుల్లో బినామీల బాగోతం

నెల్లూరు(పొగతోట): చౌకదుకాణాల డీలర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. బినామీ పేర్లతో షాపులు నిర్వహిస్తూ పేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లాలో 1,513 చౌకదుకాణాలున్నాయి. ప్రతినెలా 12,500 మెట్రిక్‌ టన్నుల బియ్యం కార్డుదారులకు అందజేస్తున్నారు. 7.21 లక్షల మంది కార్డుదారులున్నారు. 338 చౌకదుకాణాలు స్వయం, సహాయక గ్రూపు మహిళల ఆధ్వర్యంలో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని బినామీ పేర్లతో మార్పులు చేసి సంవత్సరాల నుంచి డీలర్లు నిర్వహిస్తున్నారు. కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. చౌకదుకాణానికి సంబంధించి డీలర్‌ పేరు, ఐడీ మార్పు చేయాలంటే డీఎస్‌ఓ కార్యాలయం నుంచి ఫైల్‌ నిర్వహించాల్సి ఉంది. దీనికి సుమారు వారం నుంచి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. డీలర్ల మహత్యం, నిమిషాల వ్యవధిలో ఐడీ, ఫొటో మార్పులు జరిగిపోతున్నాయి. గతవారంలో నెల్లూరులోని 50వ నంబర్‌ దుకాణంలో ఫిర్యాదులు రావడంతో ఏఎస్‌ఓ అంకయ్య తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో డీలర్‌ యశోధ అనే మహిళకు బదులు పురుషుడి ఫొటో ఉంది. తనిఖీ అనంతరం యశోధ ఫొటో ప్రత్యక్షమైంది. మరుసటి రోజు డీఎస్‌ఓ విజయ్‌కుమార్‌ తనిఖీలకు వెళ్లగా మహిళ ఫొటో ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. అదే విధంగా నగరంలో పది దుకాణాలకు సంబంధించి ఫొటోల మార్పులు జరిగినట్లు సమాచారం.

నిబంధనలతో పనిలేకుండా..

6 ఏ కేసు, ఇతర అక్రమాలకు పాల్పడిన డీలర్లను సస్పెండ్‌ చేసి ఆ దుకాణాన్ని స్వయం సహాయక గ్రూపు మహిళకు నిర్వహించేందుకు అప్పగిస్తారు. మూడు నెలలు మాత్రమే వారి ఆధ్వర్యంలో నిర్వహణకు అవకాశం ఉంది. నిబంధనలకు పాతరేసిన డీలర్లు సంవత్సరాల తరబడి ఆయా దుకాణాలను కొనసాగిస్తున్నారు. ఆన్‌లైన్‌లో డీలర్‌ ఐడీ, ఫొటో మార్పునకు సంబంధించి డీఎస్‌ఓ కార్యాలయం నుంచి ఫైల్‌ నిర్వహించి వాటికి డీఎస్‌ఓ, జాయింట్‌ కలెక్టర్‌ అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈప్రక్రియ పూర్తయిన అనంతరం ఎన్‌ఐసీ అధికారులు ఆన్‌లైన్‌లో ఐడీ, ఫొటో మార్పు చేయాల్సి ఉంది. నెల్లూరు డీలర్ల మాయాజాలం, కంప్యూటర్‌ ఆపరేటర్‌ చేతివాటంతో నిమిషాల వ్యవధిలో అవి మారిపోతున్నాయి.

ఎస్‌హెచ్‌జీల ఆధ్వర్యంలో

338 దుకాణాల నిర్వహణ

బినామీల పేర్లతో ఏళ్ల తరబడి కొనసాగింపు

తనిఖీల తర్వాత మారిపోతున్న డీలర్ల ఫొటోలు

పట్టించుకోని అధికారులు

చర్యలు తీసుకుంటాం

చౌకదుకాణాల్లో అక్రమాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌లో డీలర్ల ఫొటో మార్పునకు సంబంధించి పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదికలు తెప్పించుకుంటాం. దానికి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తాం. ఎస్‌హెచ్‌జీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుకాణాలకు ఆర్‌డీఓలు నోటిఫికేషన్‌ ఇచ్చి డీలర్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.

– విజయ్‌కుమార్‌, డీఎస్‌ఓ

రేషన్‌ షాపుల్లో బినామీల బాగోతం1
1/1

రేషన్‌ షాపుల్లో బినామీల బాగోతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement