
విధ్వంసం వెనుక కుట్ర ఎవరిది
● మాజీమంత్రి ప్రసన్న ఇంట్లో టీడీపీ
గూండాల విధ్వంసం దేనికి సంకేతం
● లోకేశ్ వచ్చి వెళ్లిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన
● ఇటీవల కూటమి ప్రభుత్వంపై ప్రసన్న ఘాటైన విమర్శలు
● విమర్శలు చేశారని కిరాయి మూకల
అరాచకం
● బూతులు మాట్లాడుతూ
చంపేస్తామంటూ రౌడీమూకలు వీరంగం
● హుందా రాజకీయాల నుంచి
గూండాయిజంపై సర్వత్రా విమర్శలు
● ప్రశ్నించినా.. విమర్శలు చేసినా
భౌతిక దాడులు, అక్రమ కేసులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా.. సుదీర్ఘ రాజకీయ చరిత్రకు, హుందా సంస్కతికి పట్టం కట్టిన నేల. దశాబ్దాలుగా రాజకీయం అంటే హుందాతనానికి చిరునామాగా ఉండేది. అటువంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గూండాయిజం రాజకీయంగా మారిపోయింది. జిల్లాలో ఆనం, నల్లపరెడ్డి, నేదురుమల్లి, మేకపాటి వంటి కుటుంబాలు రాజకీయంగా విభిన్న అభిప్రాయాలతో ఉన్నా, వ్యక్తిగత విధ్వంసాలకు పాల్పడకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ముందుకు నడిచాయి. తమకంటూ వర్గాలను సొంతం చేసుకుని హుందా రాజకీయాలు నడిపించాయి. రాజకీయ క్షేత్రంలో ఎన్నెన్నో విమర్శలు చేసుకున్నప్పటికీ ప్రతి విమర్శలు కూడా అందుకునుగుణంగా సిద్ధాంత పరంగానే ఉండేవి. రాజకీయ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది గానీ, ఇళ్లపై దాడులు, గూండాయిజం ఎన్నడూ చోటు చేసుకోలేదు. కూటమి పాలనలో రాజకీయాల స్వభావమే మారిపోయింది. ఈ మార్పు తాజాగా మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాల దాడిలో స్పష్టంగా కనిపిస్తోంది. లోకేశ్ పర్యటన ముగిశాక కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం రాజకీయ కుట్రగా వైఎస్సార్‌సీపీ నేతలు అభివర్ణిస్తున్నారు.
హుందా రాజకీయాలపై
గూండాయిజం ముసురు
తాజాగా జిల్లా రాజకీయ స్వరూపమే మారిపోయింది. రాజకీయంగా చేసిన విమర్శలపై అదే విధంగా తిప్పి కొట్టాల్సిన ప్రజాప్రతినిధులు సంయమనం కోల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి టీడీపీ కిరాయి గూండాలు సాగించిన విధ్వంస కాండ ఇందుకు అద్దం పడుతోంది. ప్రసన్నకుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎన్నో అభివద్ధి పనులు చేశారు. అందులో ముదివర్తి– ముదివర్తిపాళెం కాజ్‌వేను సైతం ప్రసన్నకుమార్‌రెడ్డి పట్టుబట్టి ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో కోవూరు ఎమ్మెల్యేగా గెలిచిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల నియోజకవర్గ పర్యటనలో ముదివర్తిపాళెం కాజ్‌వేను తమ ప్రభుత్వం నిర్మిస్తుందంటూ తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు సైతం ఈ ప్రాజెక్ట్ మంజూరుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో సహా మీడియాకు చూపించి ఇది తమ ప్రభుత్వం సాధించిన ఘనత అయితే.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అజ్ఞానంగా మాట్లాడాన్ని ఖండించారు. ఈ క్రమంలోనే సోమవారం కోవూరులోని ఓ కల్యాణ మండపంలో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ సన్నాహాక కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసన్నకుమార్‌రెడ్డి తాను నియోజకవర్గంలో ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అవినీతికి పాల్పడలేదని, తనపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేశారంటూ మండిపడ్డారు. నిఖార్సు అయిన రాజకీయాలు చేయాలే కానీ, ఎవరో రాసిచ్చిన స్క్రీప్ట్ చదవడం కాదంటూ ఘాటైన విమర్శలు చేశారు.
చంపేస్తామంటూ రౌడీమూకలు వీరంగం
ప్రసన్నకుమార్‌రెడ్డి, తన కుమారుడు రజత్‌కుమార్‌రెడ్డితో కలిసి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో రాత్రి 9 గంటల సమయంలో నెల్లూరు సుజాతమ్మ కాలనీలోని ఆయన ఇంటికి సుమారు వంద మందికి పైగా రౌడీమూకలు మారణాయుధాలతో దౌర్జన్యంగా ప్రవేశించి విధ్వంసం సష్టించారు. ప్రసన్నకుమార్‌రెడ్డి.. మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మని విమర్శిస్తావా? నిన్ను చంపేస్తామంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఇళ్లంతా ధ్వంసం చేశారు. రౌడీమూకల ఆగడాలతో బెంబేలెత్తిన ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ బెడ్ రూమ్‌లో తలుపులు వేసుకోగా వాటిని సైతం పగుల గొట్టారు. దీంతో భయాందోళనకు గురైన ఆమె బాత్ రూమ్‌లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంది. పోర్టికోలో ఉన్న బెంజ్ కారును దుండగులు ధ్వంసం చేశారు.
?
ఇప్పటికే రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో షాడో సీఎం లోకేశ్ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లో సాగించిన పచ్చమూకల దాష్టీకం కుట్ర వెనుక కచ్చితంగా లోకేశ్ కుట్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలు, చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్న తీరుపై ఘాటుగానే విమర్శలు చేశారు. దీంతో ప్రసన్నకుమార్‌రెడ్డిని టార్గెట్ చేసిన లోకేశ్.. సోమవారం నెల్లూరు జిల్లా పర్యటనలోనే విధ్వంస రచనకు ప్లాన్ గీశారని, ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న చేసిన విమర్శలను అడ్డం పెట్టుకుని, ఆయన నెల్లూరు నుంచి వెళ్లిపోయిన తర్వాత టీడీపీ రౌడీ మూకలు ఈ దాడులకు పాల్పడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే విమర్శలకు బదులుగా వాదనలు గాకుండా, రౌడీ మూకల దాడులు చోటు చేసుకోవడం రాష్ట్రంలో ప్రజాస్వామ్య భావనకు గండి పడుతోంది. విమర్శలు చేసిన నేతల ఇంటిపైనే దాడులు చేయడం దారుణమని, రాజకీయ విమర్శలను ఎదుర్కొనే సంస్కృతి క్రమంగా అంతరించిపోతున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

విధ్వంసం వెనుక కుట్ర ఎవరిది