
కాకాణికి రెండు రోజుల పోలీస్ కస్టడీ
నెల్లూరు (లీగల్): కనుపూరు చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరరించాలని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై వెంకటాచలం పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు 4వ అదనపు మొదటి తరగతి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నిషాద్ నాజ్ షేక్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాకాణిని 9వ తేదీ ఉదయం 8 గంటలకు విచారణ నిమిత్తం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పోలీస్ కస్టడీకి తీసికోవాలని తిరిగి 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు అయనకు వైద్య పరీక్షలు చేయించి మెడికల్ సర్టిఫికెట్‌తో కోర్టులో హాజరు పరచాలన్నారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదని ఉత్తర్వులో పేర్కొన్నారు. న్యాయవాది సమక్షంలో గోవర్ధన్‌రెడ్డిని విచారణ జరపాలన్నారు. కాకాణిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని వెంకటాచలం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై పోలీసులు తరఫున ఏపీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ ఏడు రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, మాలపాటి వెంకట విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని, కేవలం రాజకీయ కక్షతో కేసు పెట్టారని, పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గోవర్ధన్‌రెడ్డికి రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
డీసీపల్లిలో 527 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం నాటికి 527 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 740 బేళ్లు రాగా 527 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. గరిష్టంగా కిలోకు రూ.280, కనిష్టంగా రూ.160 ధర లభించింది. సగటున రూ.202.37 ధర పలికింది. వేలంలో 10 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
నాణ్యతలేని పొగాకు తీసుకురావొద్దు
మర్రిపాడు: ప్రస్తుతం మార్కెట్‌లో మొద్దు మచ్చలు, రెండో నంబరు, సైలెన్, బొగ్గులు ఉన్నవి తప్ప మిగిలిన అన్ని రకాల పొగాకు అమ్ముడు పోతుందని, నాణ్యత లేని పొగాకును తీసుకు రావొద్దని డీసీపల్లి వేలం కేంద్రం నిర్వహణాధికారి జీ రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కసారి అమ్ముడుపోని బేళ్లను తిరిగి అవే బేళ్లను వేలానికి తీసుకురావొద్దని, వాటి స్థానంలో వేరొక బేళ్లు కట్టి వేలానికి తీసుకురావాలని కోరుతున్నామన్నారు. పొగాకు బేళ్లు వేలానికి తీసుకుని వచ్చేటప్పుడు 1వ నంబరు పొగాకు సగం, రెండో నంబరు పొగాకు సగం ఉండేటట్లు తీసుకురావాలని సూచించారు. మొత్తం రెండో నంబరు తీసుకుని వస్తే పోటీ లేకుండా ఎక్కువ నోబిడ్స్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.
నేడు, రేపు రెవెన్యూ అసోసియేషన్ క్రీడలు
నెల్లూరురూరల్: 10వ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ క్రీడా పోటీలు ఈ నెల 9, 10 తేదీల్లో బుజబుజ నెల్లూరులోని క్రికెట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్ర స్టేడియంలో క్రికెట్ పోటీలు జరుగుతాయని మంగళవారం రెవెన్యూ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తేదీ ఉదయం 8.45 గంటలకు కలెక్టర్ ఓ ఆనంద్ క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు.
18న జెడ్పీ సర్వసభ్య సమావేశం
నెల్లూరు (పొగతోట): ఈ నెల 18న ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశం నిర్వహించనున్నట్లు సీఈఓ మోహన్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా విద్యాశాఖ, విద్యుత్ శాఖలపై సమీక్షించడం జరుగుతుందన్నారు. అధ్యక్షుల అనుమతితో ఇతర శాఖలపై సమీక్షించడం జరుగుతుందన్నారు. జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని కోరారు.

కాకాణికి రెండు రోజుల పోలీస్ కస్టడీ