
దేవుడి దయతో బయట పడ్డా
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): దేవుడి దయతోనే బయట పడ్డానని, నన్ను అంతమొందించే కుట్ర చేశారని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. తమ కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉందని, జిల్లాలోని రాజకీయ కుటుంబాల్లో ఇటువంటి సంప్రదాయం లేదన్నారు. సైద్ధాంతికంగానే తాము పోరాడామని గుర్తు చేశారు. మంగళవారం తన స్వగృహంలో ప్రసన్నకుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో తాను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కానీ, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని గాని వ్యక్తిగతంగా విమర్శించ లేదన్నారు. ఎన్నికల్లో విమర్శించుకున్నామని, విమర్శలు, ప్రతి విమర్శలు తప్పవన్నారు. ప్రశాంతిరెడ్డి గురించి తాను ఎక్కడ చెడ్డగా మాట్లాడలేదన్నారు. ఆమే తన గురించి చెడుగా మాట్లాడినా తాను పట్టించుకోలేదన్నారు. ఇటీవల ముదివర్తికి వెళ్లి నియోజకవర్గంలో ప్రసన్నకుమార్‌రెడ్డి ఒక తట్టకూడా మట్టి వేయలేదని, అన్ని తానే చేయించానని చెప్పి ప్రగల్భాలు పలికిందన్నారు. తాను ఏదో సంపాదించుకున్నానని, అవినీతి పరుడినని వ్యక్తిగతంగా దాడి చేశారన్నారు.
ఆమె విమర్శలకు కౌంటర్ ఇచ్చానే కానీ..
సోమవారం కోవూరు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో తాను ఇటీవల ఆమె మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చానే కానీ, ప్రత్యేకంగా విమర్శలు చేయలేదని ప్రసన్న స్పష్టం చేశారు. నేనన్న మాటలు వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికీ కూడా ఆ మాటలకు కట్టుబడి ఉన్నానన్నారు. తాను చెప్పింది నూటికి నూరు శాతం నిజమన్నారు. మీకు దమ్ము, ధైర్యముంటే నీవు, ప్రభాకర్‌రెడ్డి రండి ప్రెస్‌మీట్ పెట్టండి.. విమర్శలు చేయండి. మళ్లీ మేము కౌంటర్ ఇచ్చుకుంటామన్నారు. ఏదో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయిపోయి ఇలాంటి నీచ రాజకీయ సంస్కృతిని తీసుకురావడం గొప్పనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇంట్లో తానుంటే చంపేసేవారని, ఆ దేవుడు తనను బయటకు పంపించాడన్నారు. ఈ రౌడీ మూకలు ఇల్లంతా ధ్వంసం చేశారని, 85 ఏళ్ల వయస్సులోని నా తల్లి ఇంట్లో ఉంటే ఆమెను బెదిరించారన్నారు. పనివాళ్లను ప్రాణభయానికి గురి చేశారన్నారు. ఇంటిని పగలగొట్టేశారు. బెడ్‌రూమ్, ఆఫీస్ సహా ధ్వంసం చేశారన్నారు.
నన్ను అంతమొందించే కుట్ర ఇది
1961 నుంచి మా కుటుంబం
రాజకీయాల్లో ఉంది
జిల్లాలోని రాజకీయ కుటుంబాల్లో ఇలాంటి సంస్కృతి లేదు
ఇలాంటి పరిణామాలు
ప్రజాక్షేత్రంలో మంచిది కాదు
రాజకీయంగా ఇలాంటివెప్పుడూ చూడలేదు
రాజకీయాల్లో ప్రత్యర్థులు విమర్శించడం సాధారణం. ఇలా ఇళ్లపై దాడులు జరగడం నేను ఇంత వరకు చూడలేదు. ఇన్నేళ్ల రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇంట్లోకి చాలా మంది వచ్చారు. నన్ను మా వాచ్‌మెన్ రూమ్‌లో పెట్టాడు. అతన్ని బెదిరించారు. ఆమె ఎవరు అని అడిగితే పెద్దమ్మ అని చెప్పాడు. మా రూమ్‌లో కూడా వస్తువులు పగుల గొట్టారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇలా చేస్తుందనుకోలేదు.
– శ్రీలక్ష్మమ్మ, ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి