పథకాలకు బాబు వెన్నుపోటు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): చంద్రబాబు రాజకీయ జీవితం వెన్నుపోటుతోనే మొదలైందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సైతం వెన్నుపోటు పొడిచి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని నెల్లూరు నగర వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి దుయ్యబట్టారు. జూన్ 4న నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ పోస్టర్‌ను ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆ నాడు రామారావుకు వెన్నుపోటు, తర్వాత రూ.2లకే కిలో బియ్యం, మద్య నిషేధం, ఉచిత విద్యుత్‌కు వెన్నుపోటు పొడిచారన్నారు. అధికారం దక్కించుకోవడానికి కలిసొచ్చిన ‘వెన్నుపోటు’ విధానాన్ని ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా మారి ఉంటారని ఆయన ఇచ్చిన హామీలను నెరవేస్తారని నమ్మి ఆయనకు అధికారం కట్టబెడితే పాత బుద్ధి పోనిచ్చుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని గొంతు ఎత్తితే వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపించి భయపెట్టాలని చూస్తున్నారని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలను చూసి దేశంలోని ప్రజలు విస్తుపోతున్నారున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులుగా మేము ప్రజల్లోకి తలెత్తుకుని వెళ్లగలుగుతున్నామంటే అది మా నాయకుడు చేసిన సుపరిపాలన అన్నారు. అదే ఈ రోజు టీడీపీ నాయకులు ప్రజల్లోకి వచ్చి తలెత్తుకోలేని పరిస్థితి ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాదైన నేపథ్యంలో ఈ నెల 4న ‘వెన్నుపోటు దినం’గా ప్రకటించి ప్రజలతో కలిసి ఉద్యమబాట పట్టబోతున్నట్లు పేర్కొన్నారు.
అధికారులకు వినతిపత్రం ఇస్తే కేసులా?
● కాకాణి పూజిత
ఆదరించిన పార్టీకి, అధినేతకు వెన్నుపోట్లు పొడవడం చూశాం. తాజాగా గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడవడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె కాకాణి పూజిత అన్నారు. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని నిలదీసిన మా నాన్న గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ నాతోపాటు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన నాయకులపై కేసులు పెట్టడం చూస్తే కూటమి నేతలు, పోలీసులు ఎంతకు బరితెగిస్తున్నారో అర్థమవుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో కలెక్టర్‌కు అర్జీ ఇచ్చే స్వేచ్ఛ కూడా ప్రజలకు లేదా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని జైల్లో పెట్టడానికి ఉన్న ఆసక్తి, ప్రజలకు మంచి చేయడంలో చూపించాలన్నారు. అధికారులు ఇలాంటి కక్ష పూరిత చర్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని కాకాణి గోవర్ధన్‌రెడ్డి అందుబాటులో లేకపోయినా విజయవంతం చేసి కూటమి కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి కూడా భారీగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి
అర్జీ ఇచ్చే స్వేచ్ఛ కూడా ప్రజలకు లేదా? : కాకాణి పూజిత
వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ


