నువ్వు ఫెయిలై పోతావు: అభిషేక్‌ శర్మపై యువీ తండ్రి ఫైర్‌ | You Will Fail: Yograj Singh Lambasts Yuvraj Star student who disgusts him | Sakshi
Sakshi News home page

నువ్వు ఫెయిలై పోతావు: అభిషేక్‌ శర్మపై యువీ తండ్రి ఫైర్‌

Mar 28 2026 7:06 PM | Updated on Mar 28 2026 7:42 PM

You Will Fail: Yograj Singh Lambasts Yuvraj Star student who disgusts him

గత రెండేళ్లుగా టీ20 ఓపెనర్‌గా టీమిండియాలో పాతుకుపోయాడు అభిషేక్‌ శర్మ. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కొద్దికాలంలోనే ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఎదిగాడు. భారత దిగ్గజ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌కు ప్రియ శిష్యుడిగా పేరొందాడు ఈ విధ్వంసకర బ్యాటర్‌.

క్రమశిక్షణ అత్యంత ముఖ్యం
అయితే, యువీ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ (Yograj Singh) మాత్రం అభిషేక్‌ శర్మ ఆట తీరు తనకు నచ్చడం లేదంటూ షాకింగ్‌ కామెంట్లు చేశాడు. ఈ పంజాబీ ప్లేయర్‌ ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనే తొందరలో మూల్యం చెల్లిస్తున్నాడని యోగ్‌రాజ్‌ అభిప్రాయపడ్డాడు. క్రీడాకారులకు క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని.. అయితే, ఇప్పటి ఆటగాళ్లలో అది కొరవడిందని పేర్కొన్నాడు.

ఒకే సర్‌ అంటాడు కానీ..
ఇన్‌సైడ్‌స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్‌ శర్మకు చెప్పీ చెప్పీ నేను విసిగిపోయాను. ఆటను తేలికగా తీసుకోవద్దని అతడికి ఎన్నోసార్లు మెసేజ్‌లు పెట్టాను. అందుకు బదులుగా.. ‘ఒకే సర్‌’ అని సమాధానమిస్తాడు.

అలా అయితే ఫెయిలై పోతావు
మైదానంలో అడుగుపెట్టిన తర్వాత షరా మమూలే. అతడి తీరు నాకు ఏమాత్రం నచ్చడం లేదు. సింగిల్‌, డబుల్‌, బౌండరీ అని ఉంటాయి. కానీ ప్రతిసారి బంతిని గాల్లోకి లేపి సిక్సరే బాదుతానంటే ఎలా?.. మైదానంలో ఉన్న ప్రేక్షకులను అలరించేందుకు ప్రతిసారి సిక్స్‌ బాదితే నువ్వు విఫలమైపోతావు’’ అంటూ యోగ్‌రాజ్‌ సింగ్‌ అభిషేక్‌ శర్మను ఘాటుగా విమర్శించాడు.

కాగా ఇటీవల సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో అభిషేక్‌ శర్మ విఫలమయ్యాడు. హ్యాట్రిక్‌ డకౌట్ల తర్వాత రెండు హాఫ్‌ సెంచరీలతో ఫర్వాలేదనిపించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో అర్ధ శతకం బాదడంతో అతడిపై విమర్శల జడి కాస్త తగ్గింది. 

మొత్తానికి భారీ అంచనాలతో తొలిసారి వరల్డ్‌కప్‌ బరిలో దిగిన అభిషేక్‌ శర్మ ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి 141 పరుగులు చేయగలిగాడు. ప్రస్తుతం ఐపీఎల్‌-2026 టోర్నీలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ బరిలోకి దిగాడు.

చదవండి: IPL 2026: బంగ్లాదేశ్‌ యూటర్న్‌.. కీలక ప్రకటన

Advertisement
 
Advertisement
Advertisement