
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025కు సమయం అసన్నమవుతోంది. సెప్టెంబర్ 30 నుంచి భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ షూరూ కానుంది. అయితే పాకిస్తాన్ మాత్రం తమ మ్యాచ్‌లని శ్రీలంక వేదికగా ఆడనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ప్రైజ్‌మనీ ప్రకటించింది.
మొత్తం ప్రైజ్ మనీని రికార్డు స్థాయిలో 13.88 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ. 122 కోట్లు)గా ఖరారు చేసింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన చివరి వన్డే ప్రపంచకప్(2022)తో పోలిస్తే ఈ ప్రైజ్‌మనీ 300 శాతం అధికం కావడం గమనార్హం.
అప్పుడు ప్రైజ్‌మనీ కేవలం రూ. 30 కోట్ల మాత్రమే. అదేవిధంగా పురుషుల వన్డే వరల్డ్‌కప్-2023 కంటే అధికం కావడం విశేషం. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీకి ఐసీసీ రూ. 88 కోట్లు కేటాయించింది. ఇప్పుడు మహిళల ప్రైజ్‌మనీ పురుషుల టోర్నీని మించిపోయింది.
విజేతకు ఎంతంటే?
ఇక ఈ మెగా టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు 4.48 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 40 కోట్లు) నగదు బహుమతి అందనుంది. ఇది 2023 వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియా అందుకున్న దానికంటే 239 శాతం ఎక్కువ. ఆ సమయంలో ఆసీస్ కేవలం రూ. 11 కోట్లు మాత్రమే బహుమతిగా లభించింది.
ఈ ఏడాది మహిళల ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచే జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 19 కోట్లు) లభిస్తాయి. సెమీ ఫైనలిస్ట్‌లు ఒక్కొక్కరికి 1.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 9 కోట్లు) దక్కనుంది. అంతేకాకుండా ప్రతీ గ్రూపు మ్యాచ్‌లోనూ విజయం సాధించిన జట్టుకు సైతం ఐసీసీ ప్రైజ్‌మనీ కేటాయించింది.
గ్రూప్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు 34,314 డాలర్లు (దాదాపు రూ. 30 లక్షలు) అందనుంది. అదేవిధంగా ఐదు, ఆరు స్ధానాల్లో నిలిచే జట్లకు 700,000 డాలర్లు (సుమారు రూ. 6 కోట్లు), ఏడు ఎనిమిది స్ధానాల్లో నిలిచే జట్లకు 280,000 డాలర్లు (సుమారు రూ. 2.5 కోట్లు) అందనుంది.
ఇక ఈ ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొన్నందుకు ప్రతీ జట్టుకు 2,50,000 డాలర్లు (సుమారు రూ. 2 కోట్లు) ప్రైజ్ మనీ లభించనుంది. మహిళల క్రికెట్ ప్రయాణంలో ఇది ఒక చారిత్రక మైలురాయి అని ఐసీసీ చైర్మెన్ జైషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
చదవండి: IPL 2026: కేకేఆర్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!?