
అర్ష్‌దీప్ సింగ్.. టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. ఆసియాకప్-2025లో బుధవారం దుబాయ్ వేదికగా భారత్-యూఏఈ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ వంద వికెట్ల మైలు రాయిని అందుకుంటాడని అంతా భావించారు.
కానీ భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో అర్ష్‌దీప్‌కు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అతడి స్ధానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు టీమ్ మెనెజ్‌మెంట్ అవకాశమిచ్చింది. తుది జట్టులో ప్రధాన పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా ఒక్కడికే చోటు దక్కింది. అతడితో పాటు మీడియం పేస్ బౌలర్ హార్దిక్ పాండ్యా బంతిని పంచుకోనున్నాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు స్పిన్నర్లగా ఉన్నారు. అయితే పిచ్ కండీషన్స్ దృష్ట్యా కెప్టెన్ సూర్య కుమార్ అండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. వికెట్ మధ్యలో చిన్న చిన్న పగుళ్లు ఉండడంతో స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది.
అయితే అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టడానికి గల కారణాన్ని అయితే కెప్టెన్ సూర్య వెల్లడించలేదు. కాగా అర్ష్‌దీప్ గత కొంతకాలంగా భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా టీమిండియా తరపున టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్ కూడా అర్ష్‌దీప్(97)నే కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.