Lionel Messi: 'ఏంటి చూస్తున్నావ్‌.. నీ పని చూసుకో స్టుపిడ్‌'

What Are You Looking At Fool Lionel Messi Takes Dig Weghorst-Van Gaal - Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శుక్రవారం అర్జెంటీనా, నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠ రేపింది. ఆటలో ఉత్కంఠ అనుకుంటే పొరపాటే.. ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు తారాస్థాయికి వెళ్లాయి. మ్యాచ్‌లో స్పెయిన్‌ రిఫరీ ఆంటోనియో మిగ్యుల్ మాటే లాహోజ్ అందరికంటే ఎక్కువ బిజీగా కనిపించాడు. ఎందుకంటే మ్యాచ్‌లో ఆటగాళ్లకు 13 సార్లు ఎల్లో కార్డులు, ఏడుసార్లు రెడ్‌కార్డులు జారీ చేశాడు.

తొలి హాఫ్‌లో పెద్దగా ఏం జరగలేదు.. కానీ రెండో అర్థభాగంలో మాత్రం ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు దూషించుకుంటూ గేమ్‌ను కొనసాగించారు. ఇక మ్యాచ్‌లో మెస్సీ పెనాల్టీని గోల్‌గా మలిచి అర్జెంటీనాను 2-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత రెండో అర్థభాగంలో నెదర్లాండ్స్‌ స్టార్‌ వౌట్ వెఘోర్స్ట్ రెండు గోల్స్‌ కొట్టి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు మరో గోల్‌ కొట్టకపోవడంతో 2-2తో మ్యాచ్‌ డ్రాగా ముగియడం.. పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-3 తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది.

ఇక మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన మెస్సీ పోస్ట్‌మ్యాచ్‌ ఇంటర్య్వు ఇస్తూ నెదర్లాండ్‌ స్ట్రైకర్‌ వౌట్ వెఘోర్స్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటర్య్వూ ఇచ్చేటప్పుడు వౌట్‌ మెస్సీకి ఎదురుగా వచ్చాడు. దీంతో కోపంతో..'' ఏం చూస్తున్నావ్‌.. నీ పని చూసుకో స్టుపిడ్‌'' అంటూ స్పానిష్‌ భాషలో పేర్కొన్నాడు. మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ ఆటగాళ్లతో జరిగిన ఇబ్బందిని మనసులో పెట్టుకొని మెస్సీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాదు డచ్‌ మేనేజర్‌.. కోచ్‌ లుయిస్‌ వాన్‌ గాల్‌తోనూ మెస్సీ గొడవపడ్డాడు. అతనికి కూడా మెస్సీ కౌంటర్‌ ఇచ్చాడు. ''ఈరోజు మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ ఆటతీరు చూశాకా వారికి గౌరవం ఇ‍వ్వాలనిపించలేదు. ముఖ్యంగా లుయిస్‌ వాన్‌ గాల్‌ తీరు అస్సలు నచ్చలేదు. కోచ్‌ పాత్రలో ఉండి ఆయన నడుచుకున్న తీరు చిరాకు తెప్పించింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇక డిసెంబర్‌ 14న జరగనున్న తొలి సెమీఫైనల్లో క్రొయేషియాతో అర్జెంటీనా అమితుమీ తేల్చుకోనుంది. ఈ వరల్డ్‌కప్‌ మెస్సీకి ఆఖరుదని వార్తలు వస్తున్న నేపథ్యంలో అర్జెంటీనాను విజేతగా నిలపాలని జట్టు సహచరులు భావిస్తున్నారు. ఇక బ్రెజిల్‌తో జరిగిన మరో క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో క్రొయేషియా 4-2తో(పెనాల్టీ షూటౌట్‌) ద్వారా విజయం సాధించింది. నిర్ణీత సమయంలోగా 1-1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది.  

చదవండి: వెక్కి వెక్కి ఏడ్చిన నెయ్‌మర్‌.. కథ ముగిసినట్లే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top