వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్లో నీరజ్‌.. ఒలింపిక్స్‌కు అర్హత | Sakshi
Sakshi News home page

Neeraj Chopra: వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్లో నీరజ్‌ చోప్రా.. ఒలింపిక్స్‌కు అర్హత

Published Fri, Aug 25 2023 3:35 PM

WAC 2023 Neeraj Chopra In Final Qualifies for Paris Olympics - Sakshi

Neeraj In Javelin Throw Final: వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో ఒలింపియన్‌, జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా సత్తా చాటాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న మెగా ఈవెంట్‌లో ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 88.77 మీటర్లు విసిరిన నీరజ్‌ చోప్రా.. ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు.

నీరజ్‌తో పాటు డీపీ మను కూడా!
ఇక నీరజ్‌తో పాటు మరో భారత జావెలిన్‌ స్టార్‌ డీపీ మను కూడా వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్‌ రేసులో నిలిచాడు. తొలుత 78.10 మీటర్ల దూరం జావెలిన్‌ విసిరిన అతడు.. 81.31 మీ.తో ఫినిష్‌ చేశాడు. తద్వారా గ్రూప్‌- ఏ నుంచి మూడో స్థానంలో నిలిచాడు. ఈ గ్రూప్‌లో నీరజ్‌ అగ్రస్థానం కైవసం చేసుకుని 2024లో ప్యారిస్‌లో జరుగబోయే ఒలింపిక్స్‌లో బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు.  ఇక వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్‌ ఆదివారం జరుగనుంది.

అదే అత్యుత్తమం
కాగా ఈ సీజన్‌లో దోహా డైమండ్‌ లీగ్‌లో భాగంగా నీరజ్‌ 88.07 మీటర్ల దూరం జావెలిన్‌ విసిరాడు. తాజాగా బుడాపెస్ట్‌ ఫీట్‌తో తన గత రికార్డును అధిగమించాడు. కాగా తన కెరీర్‌లో అత్యుత్తమంగా నీరజ్‌ చోప్రా.. 89.94 మీటర్లు జావెలిన్‌ విసిరాడు.

స్టాక్‌హోంలో 2022లో జరిగిన డైమండ్‌ లీగ్‌లో గోల్డెన్‌ బాయ్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ​కాగా టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా స్వర్ణ పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని విశ్వవేదికపై రెపరెపలాడించిన విషయం తెలిసిందే. ప్యారిస్‌లోనూ అదే తీరుగా పసిడి సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

చదవండి: ఈసారి ఆసియా కప్‌ భారత్‌దే.. కానీ వరల్డ్‌కప్‌ మాత్రం: టీమిండియా మాజీ సెలక్టర్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement