
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ రవి బొపారా 40 ఏళ్ల లేటు వయసులో వీరంగం సృష్టించాడు. టీ20 బ్లాస్ట్ తొలి క్వార్టర్ ఫైనల్లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో నార్తంప్టన్‌షైర్‌కు ఆడుతున్న బొపారా.. నిన్న (సెప్టెంబర్ 3) సర్రేతో జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 105 పరుగులు చేశాడు.
వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో బొపారా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్‌షైర్ భారీ స్కోర్ (154/4) చేసింది. ఓపెనర్లు ఇద్దరూ డకౌటైనా బొపారా (వన్‌డౌన్‌లో వచ్చి) మెరుపు సెంచరీతో ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరు హైలైట్‌గా నిలిచింది. అతడొక్కడే జట్టు స్కోర్‌లో 70 శాతానికి పైగా చేశాడు. టీ20ల్లో బొపారాకు ఇది మూడో శతకం.
మిగతా ఆటగాళ్లలో టిమ్ రాబిన్సన్ 20, జస్టిన్ బ్రాడ్ 9, సైఫ్ జైబ్ 18 (నాటౌట్) పరుగులు చేశారు. సర్రే బౌలర్లలో జోర్డన్ క్లార్క్ 3 వికెట్లతో రాణించగా.. క్రిస్ జోర్డన్ ఓ వికెట్ పడగొట్టారు.
సామ్ కర్రన్ పోరాటం వృధా
భారీ లక్ష్య ఛేదనకు దిగిన సర్రే.. కెప్టెన్ సామ్ కర్రన్ (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఓలీ పోప్ (23 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినప్పటికీ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జార్జ్ స్క్రిమ్షా 3, బెన్ సాండర్సన్ 2 వికెట్లు తీసి సర్రేను దెబ్బకొట్టారు.