ఇషాన్‌ కిషన్‌ ఇంకా అదే భ్రమలో ఉన్నాడు: సెహ్వాగ్‌

Virender Sehwag Lauds Ishan Kishan Thinking May He Playing Still In IPL - Sakshi

అహ్మదాబాద్‌: భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ .. టీమిండియా యంగ్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. సోమవారం ఎంఎస్‌ ధోనితో పోలుస్తూ .. ఇషాన్‌ అదే తరహాలో ఆడుతున్నాడంటూ వీరు కితాబిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇషాన్‌ కిషన్‌ ఇంకా ఐపీఎల్‌ భ్రమలోనే ఉన్నాడని.. అందుకే తన విధ్వంసాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''నాకు తెలిసి ఇషాన్‌ కిషన్‌ తాను ఆడుతుంది ఐపీఎల్‌ అనుకుంటున్నట్లున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐపీఎల్‌ తరహా ప్రదర్శన చేయడం ఇషాన్‌కు మాత్రమే సాధ్యమైంది. ఏ మాత్రం భయం లేకుండా అతను కొట్టిన ఒక్కో భారీ షాట్‌ ఐపీఎల్‌లో అతని ఆటతీరును గుర్తుచేసింది. కెరీర్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్నామంటే ప్రతీ ఒక్క ఆటగాడి మదిలో భయం మెదులుతుంది. కానీ ఇషాన్‌ విషయంలో మాత్రం అది కనపడలేదు. ఇంగ్లండ్‌ బౌలర్లను ఒక్కొక్కరిని ఉతికారేసిన ఇషాన్‌ ఐపీఎల్‌లో కూడా ఇలాంటి బౌలర్లనే ఎదుర్కొన్నాడు. బహుశా అందుకే అతని పని సులువై ఉంటుంది'' అని చెప్పుకొచ్చాడు.

కాగా ఇషాన్‌ కిషన్‌ 2020 ఐపీఎల్‌ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున 14 మ్యాచ్‌ల్లో 516 పరుగులు సాధించాడు. ఇటీవలే ముగిసిన విజయ్‌ హజారే ట్రోపీలో ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన ఇషాన్‌ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. మొదటి టీ20లో విఫలమైన శిఖర్‌ ధావన్‌ స్థానంలో రెండో టీ20లో ఇషాన్‌ అడుగుపెట్టాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఇషాన్‌ కిషన్‌ తన ఆరంభ మ్యాచ్‌లోనే మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవడం విశేషం.
చదవండి:
‘కోహ్లి భయ్యా చెప్పేదాకా నాకు తెలియదు’

అప్పట్లో ఇలాగే జరిగింది.. జార్ఖండ్‌ నుంచి వచ్చి..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top