అనారోగ్యంతో మృతి చెందిన దిగ్గజ షూటర్
క్రీడా పరిపాలకుడిగా తనదైన ముద్ర
ఓసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి భారతీయుడిగా ఘనత
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పసిడి పతకం అందించిన షూటర్‌గా గుర్తింపు పొందిన రణ్‌దీర్ సింగ్ (79) మృతిచెందారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న రణ్‌ధీర్ బుధవారం కన్నుమూశారు. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన... అనారోగ్యం కారణంగా ఇటీవలే తన పదవి నుంచి తప్పుకున్నారు. షూటింగ్‌లో ఎన్నో ఘనతలు సాధించిన రణ్‌దీర్... ఆ తర్వాత పరిపాలకుడిగానూ దేశ క్రీడా రంగంపై తనదైన ముద్ర వేశారు.
2024లో నాలుగేళ్ల పదవీ కాలానికి గానూ ఓసీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన పటియాలా రాజ కుటుంబానికి చెందిన రణ్‌దీర్ సింగ్... ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. అంతకుముందు 1991 నుంచి 2015 వరకు ఆయన ఓసీఏ కార్యదర్శిగా కొనసాగారు. ‘ఇది దేశ షూటింగ్‌కు బాధాకరమైన రోజు. దేశ ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేసిన దిగ్గజ షూటర్ రాజా రణ్‌ధీర్ సింగ్ ఈ లోకం విడిచి వెళ్లారు.
వరుసగా ఐదు ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆయన... ఆ తర్వాత క్రీడా పరిపాలకుడిగా ఎన్నో ఘనతలు సాధించారు. క్రీడారంగానికి ఆయన చేసిన సేవలు మరవలేనివి. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నాం. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి’ అని భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) కార్యదర్శి రాజీవ్ భాటియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రణ్‌దీర్ సింగ్‌కు భార్య వినిత, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నేడు హరిద్వార్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. రణ్‌దీర్ కుమార్తె రాజేశ్వరి కుమారి కూడా అంతర్జాతీయ షూటర్ కావడం విశేషం.
→ 1964 టోక్యో ఒలింపిక్స్‌లో రిజర్వ్ షూటర్‌గా పాల్గొన్న రణ్‌దీర్ సింగ్... ఆ తర్వాత వరుసగా 1968 మెక్సికో, 1972 మ్యూనిక్, 1976 మాంట్రియాల్, 1980 మాస్కో, 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించారు.
→ 1978 బ్యాంకాక్ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో పురుషుల ట్రాప్ విభాగంలో పసిడి పతకం నెగ్గిన రణ్‌దీర్... ఏషియన్ గేమ్స్ షూటింగ్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించారు.
→ 1979వ సంవత్సరంలో ఆయనకు ‘అర్జున అవార్డు’ దక్కింది.
→ కెరీర్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించక ముందే పరిపాలన రంగంలోకి అడుగుపెట్టిన రణ్‌ధీర్ సింగ్ దేశ క్రీడా రంగంపై తనదైన ముద్ర వేశారు.
→ 1987 నుంచి 2010 వరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు కార్యదర్శిగా వ్యవహరించిన రణ్‌దీర్ సింగ్... 2001 నుంచి 2014 వరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో వివిధ పదవుల్లో పనిచేశారు.
→ 2003లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా)లో ఐఓసీ రిప్రెజెంటేటివ్‌గానూ విధులు నిర్వర్తించారు.
→ పటియాలా రాజ కుటుంబానికి చెందిన రణ్‌ధీర్ సింగ్‌కు షూటింగ్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ ప్రవేశం ఉంది. చిన్నతనంలో క్రికెట్, పోలోను ఇష్టపడిన ఆయన... ఆ తర్వాత ట్రాప్ షూటింగ్‌కు కెరీర్‌గా ఎంచుకున్నారు.
→ రాజ కుటుంబ వారసత్వం ఉన్నా... అందరితో సులువుగా కలిసిపోయే రణ్‌దీర్ సింగ్... అథ్లెట్లకు ఏం కావాలో వాటిని సమకూర్చడంలో ధిట్ట అని పేరు తెచ్చుకున్నారు.
→ రణ్‌దీర్ సింగ్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన కుమార్తె రాజేశ్వరి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. 2022 ఆసియా క్రీడల్లో మహిళల ట్రాప్ విభాగంలో రాజేశ్వరి రజత పతకం గెలుచుకుంది. మిగిలిన ఇద్దరు కుమార్తెలు కూడా క్రీడా అనుబంధ రంగాల్లో మంచి పేరు సాధించారు.
→ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విపత్కర సమయంలో ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ తాత్కాలిక అధ్యక్షుడిగా సమర్థవంతంగా పనిచేసిన రణ్‌దీర్‌కు మచ్చలేని పరిపాలకుడిగా గుర్తింపు ఉంది.
→ ప్రస్తుతం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ గౌరవ సభ్యుడిగా కొనసాగుతున్న సమయంలోనే ఆయన కన్నుమూశారు.
→ 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ సమయంలో అందరిపై అవినీతి ఆరోపణలు వచి్చనా... ఆ సమయంలో భారత ఒలింపిక్ సంఘం కార్యదర్శిగా పనిచేసిన రణ్‌దీర్‌పై మాత్రం కనీసం ఒక పుకారు కూడా రాలేదంటే ఆయన నిజాయతీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
రాజా రణ్‌దీర్ సింగ్ మరణవార్త విని చాలా బాధ కలిగింది. ఆయన జీవితాంతం క్రీడారంగానికి సేవ చేశారు. షూటర్‌గా, క్రీడా పరిపాలకుడిగా తోటి అథ్లెట్‌లకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అహర్నిశలు కృషిచేశారు. ఆయన వారసత్వం మన క్రీడా చరిత్రలో ఒక ప్రధాన భాగంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి.
–అభినవ్ బింద్రా, బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత.


