
వరుసగా రెండోసారి గ్రాండ్ స్విస్ టోర్నీ టైటిల్ సొంతం
క్యాండిడేట్స్ టోర్నీకీ అర్హత పొందిన భారత గ్రాండ్‌మాస్టర్
సమర్‌కండ్ (ఉజ్బెకిస్తాన్): ఆద్యంతం నిలకడగా రాణించిన భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు అనుకున్న ఫలితం సాధించింది. సోమవారం ముగిసిన గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీ మహిళల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. నిరీ్ణత 11 రౌండ్ల తర్వాత తమిళనాడు అమ్మాయి వైశాలి, కాటరీనా లాగ్నో (రష్యా) 8 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.
అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... 24 ఏళ్ల వైశాలికి టైటిల్ ఖాయమైంది. కాటరీనా లాగ్నో రన్నరప్‌గా నిలిచింది. వరుసగా రెండోసారి గ్రాండ్ స్విస్ టోరీ్నలో టైటిల్ నెగ్గిన వైశాలితోపాటు కాటరీనా లాగ్నో వచ్చే సంవత్సరం జరిగే క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత పొందారు. వైశాలికి 90 వేల డాలర్లు (రూ. 79 లక్షల 33 వేలు), కాటరీనా లాగ్నోకు 75 వేల డాలర్లు (రూ. 66 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
భారత్ నుంచి ముగ్గురు...
ఎనిమిది మంది మధ్య జరిగే క్యాండిడేట్స్ టోరీ్నకి ఇప్పటికి ఏడుగురు అర్హత సాధించగా... అందులో ముగ్గురు భారత గ్రాండ్‌మాస్టర్లు (కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్, వైశాలి) ఉండటం విశేషం. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) 2024–2025 మహిళా ఈవెంట్స్ విజేతకు చివరిదైన ఎనిమిదో బెర్త్ ఖరారు అవుతుంది. క్యాండిడేట్స్ టోర్నీ విజేత ప్రస్తుత మహిళల ప్రపంచ చాంపియన్ జు వెన్‌జున్‌తో 2026 వరల్డ్ టైటిల్ కోసం తలపడుతుంది.
చివరి రౌండ్ గేమ్‌లు ‘డ్రా’
గ్రాండ్ స్విస్ టోర్నీ చివరిదైన 11వ రౌండ్‌లో వైశాలి, కాటరీనా తమ ప్రత్యర్థులతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. ప్రపంచ మాజీ చాంపియన్ టాన్ జోంగి (చైనా)తో జరిగిన గేమ్‌ను వైశాలి 43 ఎత్తుల్లో... ఉల్వియా (అజర్‌బైజాన్)తో గేమ్‌ను కాటరీనా లాగ్నో 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఈ టోరీ్నలో వైశాలి ఆరు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోగా... కాటరీనా లాగ్నో ఐదు గేముల్లో నెగ్గి, ఆరు గేమ్‌లను ‘డ్రా’గా ముగించింది.
భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచింది. మరోవైపు గ్రాండ్ స్విస్ టోర్నీ ఓపెన్ విభాగంలో అనీశ్ గిరి (నెదర్లాండ్స్–8 పాయింట్లు) విజేతగా... మథియాస్ బ్లూబామ్ (జర్మనీ–7.5 పాయింట్లు) రన్నరప్‌గా నిలిచి వచ్చే ఏడాది క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించారు. చాంపియన్ అనీశ్ గిరికి 90 వేల డాలర్లు (రూ. 79 లక్షల 33 వేలు), రన్నరప్ మథియాస్‌కు 75 వేల డాలర్లు (రూ. 66 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.