వైభవ్‌కు నో ఛాన్స్‌.. టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనర్లు వీరే? | Vaibhav Sooryavanshi Snubbed As Ambati Rayudu Picks This Duo As India Openers At T20 WC 2028 | Sakshi
Sakshi News home page

వైభవ్‌కు నో ఛాన్స్‌.. టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనర్లు వీరే?

May 31 2026 9:06 PM | Updated on May 31 2026 9:06 PM

Vaibhav Sooryavanshi Snubbed As Ambati Rayudu Picks This Duo As India Openers At T20 WC 2028

రాజస్తాన్‌ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో భారత సీనియర్‌ జట్ట వైపు దూసుకొస్తున్నాడు. ఇప్పటికే ఆసియా క్రీడలకు బీసీసీఐ ఎంపిక చేసిన 30 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబుబుల్స్‌ జాబితాలో వైభవ్‌ చోటు దక్కించుకున్నాడు.

అంతకంటే ముందు ఐర్లాండ్‌ లేదా జింబాబ్వేలతో టీ20 సిరీస్‌ల కోసం భారత జట్టుకు వైభవ్‌ ఎంపికయ్యే అవకాశముంది. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే సంచనాలు సృష్టిస్తున్న వైభవ్‌ను భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్‌గా అభివర్ణిస్తున్నారు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌-2028లో భారత జట్టుకు వైభవ్‌ కీలకం కానున్నాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ టోర్నీలో వైభవ్‌.. అభిషేక్‌ శర్మ లేదా సంజూ శాంసన్‌లతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడని మాజీలు ఇప్పటి నుంచే జోస్యం చెబుతున్నారు.

కానీ భారత మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు మాత్రం పొట్టి ప్రపంచకప్‌ కోసం కొత్త భారత ఓపెనింగ్‌ జోడీని ఎంచుకున్నాడు. శుబ్‌మన్‌ గిల్‌, సాయిసుదర్శన్‌లు భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించాలని అతడు సూచించాడు. 

"ఆస్ట్రేలియా వంటి కఠిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగల ఓపెనింగ్ జోడీ(సాయిసుదర్శన్‌-శుభ్‌మన్‌ గిల్‌)ని ఇప్పుడు మనం ఐపీఎల్‌లో చూస్తున్నాము. ప్రస్తుతం ఐపీఎల్‌లో కూడా పిచ్‌లు ఆస్ట్రేలియా మాదిరిగానే అంతే వేగం, బౌన్స్‌ను కలిగి ఉన్నాయి. 

అలాంటి పిచ్‌లపై కూడా గిల్‌-సుదర్శన్‌ జోడీ అద్భుతంగా రాణిస్తోంది. వీరిద్దరూ 2028 ప్రపంచ కప్‌ టోర్నీకి ఎంపిక కాకపోతే కచ్చితంగా నేను ఆశ్చర్యపోతాను. ఈ మెగా టోర్నీలో గిల్‌-సుదర్శన్‌లు టీమిండియా ఓపెనర్లగా బరిలోకి దిగాలి. ఎందుకంటే ఒకరి ఆట తీరుపై మరొకరికి చాలా మంచి అవగాహన ఉంది. 

విభిన్నమైన విదేశీ పరిస్థితుల్లో జట్టు రాణించాలనుకుంటే, వీరిద్దరూ కలిసి ఉండటం అనేది జట్టుకు చాలా పెద్ద సానుకూలాంశం" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు పేర్కొన్నాడు. కాగా శుబ్‌మన్‌ గిల్‌ ప్రస్తుతం భారత టీ20 సెటాప్‌లోనే లేడు. 

అతడు చివరగా సౌతాఫ్రికాపై టీ20 మ్యాచ్‌ ఆడాడు. వరుస మ్యాచ్‌లలో విఫలం కావడంతో టీ20 ప్రపంచకప్‌-2026 జట్టును అతడిని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ తప్పించింది. ఇప్పుడు మళ్లీ గిల్‌ను టీ20లకు ఎంపిక చేయమని రాయుడు సూచించడం గమనార్హం.
చదవండి: IPL 2026: తుది పోరులో తుస్సుమనిపించిన శుబ్‌మన్‌ గిల్‌

 

Advertisement
 
Advertisement
Advertisement