వైభవ్‌ సూర్యవంశీకి గోల్డెన్‌ ఛాన్స్‌! | Vaibhav Sooryavanshi Set To Play Asian Games Selectors feels He is ready | Sakshi
Sakshi News home page

BCCI: వైభవ్‌ సూర్యవంశీకి గోల్డెన్‌ ఛాన్స్‌!

Apr 15 2026 5:43 PM | Updated on Apr 15 2026 7:15 PM

Vaibhav Sooryavanshi Set To Play Asian Games Selectors feels He is ready

ఆ పర్యటనలలో కాకపోయినా ఆసియా క్రీడల నాటికి గ్రీన్‌ సిగ్నల్‌

రాజస్తాన్‌ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే సెలక్టర్లు ఈ బుడ్డోకి పచ్చజెండా ఊపేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఈ ఏడాదే భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టు తరఫున అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 

ప్రస్తుతం ఐపీఎల్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్మురేపుతున్న 15 ఏళ్ల వైభవ్‌ (Vaibhav Suryavanshi)... క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) రికార్డును బద్దలు కొట్టడం నిశ్చయమని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఐపీఎల్‌ 19వ సీజన్‌ అనంతరం భారత జట్టు ఐర్లాండ్‌–ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. అనంతరం జింబాబ్వేతోనూ టీ20 సిరీస్‌ ఆడనుంది. 

ఈ పర్యటనలకు కుదరకపోయినా..
ఈ పర్యటనల కోసం త్వరలోనే జట్లను ప్రకటించే అవకాశం ఉంది. దీని కోసం అజిత్‌ అగర్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ 35 మంది ప్రాబబుల్స్‌ పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో వైభవ్‌ పేరు కూడా ఉంది. 

‘మాస్టర్‌ బ్లాస్టర్‌’ సచిన్‌ టెండూల్కర్‌ 16 ఏళ్ల 205 రోజుల వయసులో దాయాది పాకిస్తాన్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేయగా... ఆ వయసుకన్నా ముందే వైభవ్‌ దేశానికి ప్రాతినిధ్యం వహించేలా ఉన్నాడు. ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌తో పాటు దేశవాళీ, ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న సూర్యవంశీని సీనియర్‌ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్‌ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ఆసియా క్రీడల వరకైనా
ఈ నేపథ్యంలో ఒకవేళ తక్షణమే అతడికి అవకాశం కల్పించకున్నా... ఈ ఏడాది చివర్లో జరగనున్న ఆసియా క్రీడల వరకైనా సీనియర్‌ టీమిండియాకు ఎంపిక చేయడం ఖాయమే. ఈ ఏడాది సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జపాన్‌ వేదికగా ఏషియన్‌ గేమ్స్‌ జరగనుండగా... అదే సమయంలో టీమిండియా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. 

ఆ సమయంలో రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేయాల్సి వస్తే... అందులో ఒక దాంట్లో సూర్యవంశీని ఎంపిక చేయొచ్చు అని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ‘35 మంది ప్రాబబుల్స్‌ నుంచి సెలెక్టర్లు జట్టును ఎంపిక చేయనున్నారు. వారందరి వీసా పనులు ప్రారంభమయ్యాయి. 

టీమిండియాలోకి బుడ్జోడు ఎంట్రీ ఖరారు

వైభవ్‌ను ఎంపిక చేయాలంటే..
వైభవ్‌ సూర్యవంశీ ప్రదర్శనను సెలక్టర్లు దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు. అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న సమయంలో నాలుగో ఓపెనర్‌ అవసరమేముంది. అంతకు కావాలి అంటే యశస్వి జైస్వాల్‌ కూడా ఉన్నాడు. 

వైభవ్‌ను ఎంపిక చేయాలి అంటే అభిషేక్, సంజూలను తీసుకోకపోవడానికి బలమైన కారణం అంటూ ఉండాలి. వారిద్దరిలో ఒక్కరిని పక్కన పెట్టినా... కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను కొనసాగించడంపై ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే ఆసియా క్రీడల సమయంలో మాత్రం రెండు జట్లు అనివార్యమే కాబట్టి వైభవ్‌ను ఎంపిక చేయవచ్చు’ అని అయన అన్నారు. 

పసిడి పతకాలు
కాగా 2023లో తొలిసారి ఆసియా క్రీడలకు బీసీసీఐ పురుష, మహిళా జట్లను పంపగా.. రెండు జట్లు స్వర్ణ పతకాలు గెలిచాయి.  రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్సీలో టీమిండియా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో మహిళా జట్టు గోల్డ్‌ మెడల్‌అందుకున్నాయి.

చదవండి: PSL: అక్కడ వద్దంటేనే ఇక్కడికి: పీసీబీ పరువు తీసిన పాక్‌ క్రికెటర్‌

Advertisement
 
Advertisement
Advertisement