WWEని తాకిన వైభవ్‌ సూర్యవంశీ క్రేజ్‌ | Vaibhav Sooryavanshi mania takes over WWE, Drew McIntyre post on IPL prodigy is viral | Sakshi
Sakshi News home page

WWEని తాకిన వైభవ్‌ సూర్యవంశీ క్రేజ్‌

May 27 2026 6:43 PM | Updated on May 27 2026 6:53 PM

Vaibhav Sooryavanshi mania takes over WWE, Drew McIntyre post on IPL prodigy is viral

రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ క్రేజ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (WWE) లాంటి అంతర్జాతీయ ఈవెంట్‌ను తాకింది. ఆ ఈవెంట్‌ సూపర్‌ స్టార్‌ డ్రూ మెక్‌ఇన్‌టైన్‌ (Drew McIntyre) వైభవ్‌పై అభిమానాన్ని బహిరంగంగా చాటుకున్నాడు. 

వైభవ్‌ ఐపీఎల్‌ జెర్సీతో జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. Chosen One అని క్యాప్షన్‌ పెట్టాడు. ఈ పోస్ట్‌ కొద్ది నిమిషాల్లోనే వైరలైంది. వైభవ్‌కు వచ్చిన క్రేజ్‌ చూసి భారత క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 

బుడ్డోడు అతి స్వల్పకాలంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడని ప్రశంసిస్తున్నారు. సచిన్‌, ధోని, విరాట్‌ లాంటి దిగ్గజాలను ఇప్పటికీ చాలామంది అంతర్జాతీయ అథ్లెట్లు గుర్తు పట్టలేరని కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా వైభవ్‌ క్రేజ్‌ చూసి ఔరా అంటున్నారు.

డ్రూ మెక్‌ఇన్‌టైన్‌ పోస్ట్‌కు రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ స్పందించడం మరింత వైరల్‌గా మారింది. "2K గేమ్‌లో నేను ఎన్ని Future Shock DDTలు వేసానో గుర్తులేదు" అంటూ సరదాగా కామెంట్‌ చేశాడు. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ అధికారిక సోషల్‌మీడియా ఖాతా కూడా "Certainly" అంటూ స్పందిస్తూ.. వైభవ్‌ నిజంగానే "Chosen One" అన్నట్లుగా వ్యాఖ్యానించింది.

ఇదిలా ఉంటే, రాజస్థాన్‌ రాయల్స్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిచి చివరి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కించుకుంది. ముల్లాన్‌పూర్‌ వేదికగా ఇవాళ (మే 27) జరుగబోయే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆ జట్టు ఎస్‌ఆర్‌హెచ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతనాడిన  14 మ్యాచ్‌ల్లో 232.27 స్ట్రయిక్‌రేట్‌తో 583 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు సహా 53 సిక్సర్లు, 50 బౌండరీలు ఉన్నాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ మ్యాచ్‌లోనూ ఇదే విధ్వంసం కొనసాగుతుందని రాయల్స్‌ ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు.

పైగా వైభవ్‌కు ప్లే ఆఫ్స్‌లో (నాకౌట్స్‌) మరింత ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉండటం వారి ఆనందానికి అవథుల్లేకుండా చేస్తుంది. ఇప్పటివరకు వైభవ్‌ ఆడిన 8 నాకౌట్స్‌లో 209.62 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 392 పరుగులు చేశాడు. రాయల్స్‌ ఫ్యాన్స్‌ ధీమాకు మరో కారణం​ కూడా ఉంది. ఇదే సీజన్‌ లీగ్‌ మ్యాచ్‌లో వైభవ్‌ ఆ జట్టుపై కేవలం 37 బంతుల్లో శతక్కొట్టాడు.

ఇన్ని సానుకూల అంశాల నడుమ నేటి మ్యాచ్‌లో వైభవ్‌ విధ్వంసం ఖాయమని అంతా భావిస్తున్నారు. మరి వైభవ్‌ ఏం చేస్తాడో చూడాలి. 

Advertisement
 
Advertisement
Advertisement