థ్రిల్లర్‌ను తలపించిన వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ | Sakshi
Sakshi News home page

థ్రిల్లర్‌ను తలపించిన వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌

Published Fri, Jul 7 2023 9:40 AM

UAE Prevail In A High Scoring Thriller At CWC23 Qualifier Against USA - Sakshi

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ 2023లో తొమ్మిదో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ థ్రిల్లర్‌ను తలపించింది. యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ ఆఖరి బంతికి పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ హై స్కోరింగ్‌ మ్యాచ్‌లో యూఎస్‌ఏ చివరి బంతికి కనీసం ఒక్క పరుగు చేసినా మ్యాచ్‌ టై అయ్యేది. అయితే సంచిత్‌ శర్మ బౌలింగ్‌లో అరవింద్‌కు క్యాచ్‌ ఇచ్చి అలీ ఖాన్‌ ఔట్‌ కావడంతో యూఏఈ పరుగు తేడాతో జయకేతనం ఎగురవేసింది.

ఆఖరి ఓవర్‌లో యూఎస్‌ఏ గెలుపుకు 11 పరుగులు అవసరం కాగా, చేతిలో 3 వికెట్లు ఉన్నాయి. తొలి 3 బంతులకే 7 పరుగులు రావడంతో యూఎస్‌ఏ గెలుపు నల్లేరుపై నడకే అని అంతా అనుకున్నారు. అయితే యూఏఈ బౌలర్‌ సంచిత్‌ శర్మ అనూహ్యంగా పుంజుకుని నాలుగో బంతికి, ఆఖరి బంతికి వికెట్లు సాధించి, తన జట్టును గెలిపించాడు. అప్రధానమైన ఈ మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా యూఏఈ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

ఆసిఫ్‌ ఖాన్‌ 151 నాటౌట్‌..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఏఈ.. ఓపెనర్‌ ఆసిఫ్‌ ఖాన్‌ (145 బంతుల్లో 151 నాటౌట్‌; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. యూఏఈ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్‌ ఖాన్‌ చెలరేగగా.. ఆర్యాన్ష్‌ శర్మ (57), బాసిల్‌ హమీద్‌ (44) రాణించారు. యూఎస్‌ఏ బౌలర్లలో అలీ ఖాన్‌ 2, నోష్‌తుష్‌ కెంజిగే, నేత్రావాల్కర్‌ తలో వికెట్‌ పడట్టారు. 

రాణించిన జోన్స్‌, మోనాంక్‌ పటేల్‌, గజానంద్‌..
309 పరుగుల లక్ష్య ఛేదనలో యూఏస్ఏ సైతం అద్భుతంగా పోరాడింది. ఆరోన్‌ జోన్స్‌ (75), మోనాంక్‌ పటేల్‌ (61), గజానంద్‌ సింగ్‌ (69) అర్ధసెంచరీలతో రాణించడంతో యూఏస్‌ఏ విజయతీరాల వరకు చేరింది. అయితే ఆఖరి బంతికి రెండు పరుగులు చేయలేక ఆ జట్టు ఓటమిపాలై, క్వాలిఫయర్స్‌లో చివరి స్థానంలో నిలిచింది. యూఏఈ బౌలర్లలో సంచిత్‌ శర్మ 3, సి​ద్దిఖీ, అలీ నసీర్‌ తలో 2 వికెట్లు, జవాదుల్లా, అఫ్జల్‌ ఖాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement