
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. గిల్‌కు టెస్ట్‌ల్లో ఇదే తొలి డబుల్ సెంచరీ. ఈ డబుల్ సెంచరీతో గిల్ చాలా రికార్డులను తిరగరాశాడు.
టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత కెప్టెన్‌గా.. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా.. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడిగా.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడిగా పలు రికార్డులు నెలకొల్పాడు.
గిల్ భారీ డబుల్ సెంచరీ అనంతరం క్రికెట్ అభిమానులు ఓ విషయంపై ఆరా తీయడం మొదలు పెట్టారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎవరిదని వెతకడం ప్రారంభించారు. అలాగే భారత్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎవరిదని.. ఇందులో గిల్ స్థానం ఏంటని గూగుల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో టెస్ట్‌ల్లో టాప్ 10 అత్యధిక వ్యక్తిగత స్కోర్లపై ఓ లుక్కేద్దాం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉంది. లారా 2004లో ఆంటిగ్వాలో ఇంగ్లండ్‌పై 400 పరుగలు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో క్వాడ్రపుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా లారా కొనసాగుతున్నాడు.
ఈ జాబితాలో లారా తర్వాతి స్థానంలో ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఉన్నాడు. హేడెన్ 2003లో పెర్త్ మైదానంలో జింబాబ్వేపై 380 పరుగులు చేశాడు. దీనికి ముందు అత్యధిక స్కోర్ రికార్డు లారా పేరిటే ఉండింది. లారా 1994లో ఆంటిగ్వాలో ఇంగ్లండ్‌పై 375 పరుగులు చేశాడు. దాదాపు 9 ఏళ్లు లారా పేరిటే టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు నమోదై ఉండింది.
అయితే హేడెన్ 2003లో ఈ రికార్డును బద్దలు కొట్టాడు. హేడెన్ తన రికార్డును బద్దలు కొట్టిన ఏడాదిలోపే లారా క్వాడ్రాపుల్ సెంచరీ చేసి తిరిగి ఆ రికార్డును తన పేరిటే లిఖించుకున్నాడు.
2006లో లారా రికార్డును శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే బద్దలు కొడతాడని అంతా అనుకున్నారు. కొలొంబోలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో జయవర్దనే 374 పరుగులకు ఔటై లారా ఆల్‌టైమ్ రికార్డుకు 26 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.
లారా, హేడెన్, జయవర్దనేకు ముందు ఈ రికార్డు విండీస్ ఐకాన్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ పేరిట ఉండేది. 1958లో సోబర్స్ పాకిస్తాన్‌పై 365 పరుగులు చేశాడు. ఈ రికార్డు 36 ఏళ్ల పాటు సోబర్స్ ఖాతాలోనే ఉండింది. 1994లో తన దేశానికి చెందిన లారా ఈ రికార్డును బద్దలు కొట్టాడు.
సోబర్స్‌కు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం లెన్ హటన్ ఖాతాలో ఉండింది. 1938లో అతను ఆస్ట్రేలియాపై 364 పరుగులు సాధించాడు. అప్పటివరకు ఈ రికార్డు మరో ఇంగ్లండ్ ఆటగాడు వాలీ హేమండ్ పేరిట ఉండింది. హేమండ్ 1933లో న్యూజిలాండ్‌పై 336 పరుగులు చేశాడు.
టెస్ట్‌ల్లో ఏడో అత్యధిక వ్యక్తిగత స్కోర్ శ్రీలంక డాషింగ్ బ్యాటర్ సనత్ జయసూర్య పేరిట ఉంది. జయసూర్య 1997లో భారత్‌పై 340 పరుగులు చేశాడు. జయసూర్య తర్వాత ఈ రికార్డు పాకిస్తాన్ స్టయిలిష్ బ్యాటర్ యూనిస్ ఖాన్ పేరిట ఉంది. 2009లో యూనిస్ శ్రీలంకపై 313 పరుగులు చేశాడు.
తొమ్మిదో స్థానంలో ఇంగ్లండ్ ఆటగాడు వాలీ హేమండ్ (336) ఉన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్కోర్ చేసిన పదవ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ ఉన్నాడు. వార్నర్ 2019లో పాకిస్తాన్‌పై 335 పరుగులు చేశాడు.
ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు 31 మంది ఆటగాళ్లు ట్రిపుల్ సెంచరీలు చేశారు. భారత్ తరఫున ఈ ఘనతను వీరేంద్ర సెహ్వాగ్ రెండు సార్లు.. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టు సభ్యుడు కరుణ్ నాయర్ ఓ సారి సాధించారు.
భారత్ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాపై 319 పరుగులు చేశాడు. భారత్ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా సెహ్వాగ్ పేరిటే ఉంది. 2004లో సెహ్వాగ్ ముల్తాన్‌లో పాకిస్తాన్‌పై 309 పరుగులు చేశాడు. కరుణ్ విషయానికొస్తే.. ఇతను 2016లో ఇంగ్లండ్‌పై అజేయమైన 303 పరుగులు చేశాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 269 పరుగులు చేసిన గిల్ టెస్ట్‌ల్లో భారత్ తరఫున ఏడో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను నమోదు చేశాడు. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్‌లో 61వ అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.