
పొట్టి క్రికెట్‌లో ఓ అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఫార్మాట్ చరిత్రలో తొలిసారి ఓ బ్యాటర్ టైమ్డ్ ఔట్‌గా (Timed Out) ప్రకటించబడ్డాడు. కేరళ క్రికెట్ లీగ్-2025లో భాగంగా ఇది జరిగింది.
నిన్న (సెప్టెంబర్ 5) కాలికట్ గ్లోబ్‌స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (రెండో సెమీఫైనల్) కొచ్చి బ్లూ టైగర్స్ ఆటగాడు అల్ఫీ ఫ్రాన్సిస్ జాన్ టైమ్డ్ ఔట్ అయ్యాడు. నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు ఔటయ్యాక 90 సెకెన్లలోపు మరో ఆటగాడు క్రీజ్‌లోకి రావాల్సి ఉంటుంది.
అయితే ఈ ఘటనలో అల్ఫీ నిర్దేశిత సమయాన్ని దాటాక క్రీజ్‌లోకి వచ్చాడు. ఇది గమనించిన కాలికట్ బౌలర్లు ఫీల్డ్ అంపైర్‌కు అప్పీల్ చేశారు. పలు మార్లు పరిశీలించిన అనంతరం అంపైర్ అల్ఫీని ఔట్‌గా ప్రకటించాడు.
దీంతో అల్ఫీ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే క్షణాల్లో తిరిగి పెవిలియన్‌కు చేరాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఓ బ్యాటర్ టైమ్డ్ ఔట్ ద్వారా ఔట్ కావడం ఇదే మొదటిసారి.
ఇలాంటి ఘటన ఇటీవల ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఐసీసీ వరల్డ్ కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔటయ్యాడు. బంగ్లా ఆటగాడు షకీబ్ అల్ హసన్ అప్పీల్ మేరకు అంపైర్లు మాథ్యూస్‌ను టైమ్డ్ ఔట్‌గా ప్రకటించారు.
ఈ ఉదంతం తర్వాత షకీబ్ విమర్శలు ఎదుర్కొన్నాడు. క్రీడాస్పూర్తిని మరిచి ప్రవర్తించాడని మాటలు పడ్డాడు. ఏది ఏమైనా నిబంధనల ప్రకారం మాథ్యూస్ టైమ్డ్ ఔట్ కరెక్టేనని మరికొందరు షకీబ్‌కు మద్దతుగా మాట్లాడారు.
క్రికెట్ చరిత్రలో టైమ్డ్ ఔట్ నిబంధన ఉల్లంఘించి ఇప్పటివరకు ఏడుగురు ఔటైనట్లు తెలుస్తుంది. తొలిసారి ఈ నిబంధన ఉల్లంఘణకు బలైన ఆటగాడు హెరాల్డ్ హేగేట్ (సర్రే). 1919 కౌంటీ సీజన్‌లో సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో హెరాల్డ్ నిర్దేశిత సమయంలోపు క్రీజ్‌లోకి రాలేదు. దీంతో అంపైర్లు అతన్ని ఔట్‌గా ప్రకటించారు.
ప్రస్తుతం టీ20 క్రికెట్ జరుగుతున్న తీరు ప్రకారం టైమ్డ్ ఔట్ అన్నది అసాధారణం. ఎందుకంటే, ఆటగాళ్లు క్రీజ్‌కు అతి సమీపంలో డగౌట్లలో ఉంటారు. ఓ ఆటగాడు ఔటయ్యాక మరో ఆటగాడు క్షణాల్లో క్రీజ్‌లో వాలిపోవచ్చు. అలాంటిది తాజా ఉదంతంలో అల్ఫీ 90 సెకెన్లు దాటినా క్రీజ్‌లోకి రాకపోవడమనేది అసాధారణమనే అని చెప్పాలి.
మ్యాచ్ విషయానికొస్తే.. అల్ఫీ టైమ్డ్ ఔట్ ఉదంతం తర్వాత కూడా తొలుత బ్యాటింగ్ చేసిన కొచ్చి జట్టు భారీ స్కోర్ చేసింది. నికిల్ (64 నాటౌట్) మెరుపు అర్ద సెంచరీతో, ఆఖర్లో ఆషిక్ (31) సుడిగాలి వేగంతో పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో కాలికట్ తడబడింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయింది. అఖిల్ స్కారియా (72 నాటౌట్) కాలికట్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ గెలుపుతో కొచ్చి టైగర్స్ ఫైనల్స్‌కు చేరింది.
ఈ సీజన్‌లో కొచ్చి ఫైనల్స్‌కు చేరడంలో టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ కీలకపాత్ర పోషించాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో ఇరగదీసి కొచ్చిని సెమీస్ వరకు తీసుకొచ్చాడు. ఆసియా కప్ కోసం సంజూ దుబాయ్‌కు వెళ్లడంతో సెమీస్ ఆడలేదు.