భారత మహిళలకు చేజారిన విజయం 

Third ODI tie with Bangladesh - Sakshi

బంగ్లాదేశ్‌తో మూడో వన్డే ‘టై’ 

1–1తో సిరీస్‌ సమం  

మిర్పూర్‌: బంగ్లాదేశ్‌ మహిళలతో చివరి వన్డేలో భారత మహిళల జట్టు విజయలక్ష్యం 226 పరుగులు...41.1 ఓవర్లలో స్కోరు 191/4...చేతిలో 6 వికెట్లతో మరో 53 బంతుల్లో 35 పరుగులే కావాలి. కానీ ఇక్కడే మ్యాచ్‌ మలుపు తిరిగింది.  ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్లీన్‌ డియోల్‌ (108 బంతుల్లో 77; 9 ఫోర్లు), దీప్తి శర్మ (1) ఒకే ఓవర్లో రనౌటయ్యారు.

34 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోయిన భారత్‌ స్కోరును సమం మాత్రమే చేయగలిగింది. చివర్లో 19 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా లక్ష్యాన్ని అందుకోలేక మూడు బంతులు మిగిలి ఉండగానే ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్‌ (45 బంతుల్లో 33 నాటౌట్‌) మరో ఎండ్‌లో ఉండగా...చివరి ఓవర్‌ మూడో బంతికి మేఘనా సింగ్‌ను మారుఫా అవుట్‌ చేసింది. దాంతో మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది.

భారత్‌ 49.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్‌ కాగా... అంతకు ముందు బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులే చేసింది. అప్పటికే నిర్ణీత సమయం దాటిపోవడంతో నిబంధనల ప్రకారం సూపర్‌ ఓవర్‌ నిర్వహించలేదు. తొలి రెండు వన్డేల్లో ఇరు జట్లు ఒక్కోటి గెలవడంతో సిరీస్‌ 1–1తో ‘డ్రా’ అయింది. 

భారత్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ స్మృతి మంధాన (85 బంతుల్లో 59; 5 ఫోర్లు) రాణించింది. స్మృతి, హర్లీన్‌ మూడో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (14; 2 ఫోర్లు) నిరాశపర్చడంతో పాటు స్వల్ప విరామంలో ఓవర్‌కు రెండు చొప్పున నాలుగు వికెట్లు కోల్పోవడం భారత్‌ గెలుపురాతను మార్చింది. అంతకు ముందు ఫర్జానా హక్‌ (160 బంతుల్లో 107; 7 ఫోర్లు), షమీమా సుల్తానా (78 బంతుల్లో 52; 5 ఫోర్లు) బంగ్లా స్కోరులో కీలక పాత్ర పోషించారు. బంగ్లాదేశ్‌ తరఫున మహిళల వన్డేల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా ఫర్జానా నిలిచింది.  

చివరి వన్డేలో అంపైరింగ్‌ ప్రమాణాలపై భారత కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇన్నింగ్స్‌ 34వ ఓవర్లో నాహిదా బౌలింగ్‌లో అవుటయ్యాక హర్మన్‌ తన బ్యాట్‌తో స్టంప్స్‌ను బలంగా కొట్టి అంపైర్‌తో వాగ్వాదానికి దిగింది. ‘ఈ మ్యాచ్‌తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్‌ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్‌కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో’ అని హర్మన్‌ వ్యాఖ్యానించింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top