SRH ఎప్పటికీ నన్ను అన్‌బ్లాక్‌ చేయదు: వార్నర్‌ | SRH–David Warner Split Continues To Spark Debate As Orange Army Fans React To Instagram Block Controversy, Read Story Inside | Sakshi
Sakshi News home page

SRH ఎప్పటికీ నన్ను అన్‌బ్లాక్‌ చేయదు: వార్నర్‌ భావోద్వేగం

May 25 2026 12:21 PM | Updated on May 25 2026 1:48 PM

They would never unblock me: Warner laments getting blocked by SRH Insta

డేవిడ్‌ వార్నర్‌ (PC: BCCI)

‘ఆరెంజ్‌ ఆర్మీ’తో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా అతడు అందించిన చిరస్మరణీయ విజయాలతో పాటు.. తెలుగు పాటలకు రీల్స్‌ చేస్తూ తానూ హైదరాబాదీనే అన్నట్లుగా అతడు వ్యవహరించిన తీరు ఇందుకు కారణం.

అంతేకాదు.. నితిన్‌ ‘రాబిన్‌హుడ్‌’ సినిమాలో వార్నర్‌ (David Warner) ఓ కీలక పాత్రలో తళుక్కుమన్నాడు కూడా!.. ఇక సన్‌రైజర్స్‌కు తొలిసారిగా 2016లో టైటిల్‌ అందించిన కెప్టెన్‌గానూ వార్నర్‌ పట్ల ఆరెంజ్‌ ఆర్మీకి ఇప్పటికీ అభిమానం ఉంది. మరోవైపు.. వార్నర్‌ సైతం ఐపీఎల్‌-2026లో సన్‌రైజర్స్‌ సాధించిన విజయాల పట్ల హర్షం వ్యక్తం చేశాడు.

వార్నర్‌ను బ్లాక్‌ చేసిన SRH
అయితే, సన్‌రైజర్స్‌ యాజమాన్యం మాత్రం తమ సోషల్‌ మీడియా ఖాతాలో ఇప్పటికీ వార్నర్‌ను బ్లాక్‌ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సన్‌రైజర్స్‌ పేజ్‌ను ఇన్‌స్టాలో ట్యాగ్‌ చేస్తూ.. వార్నర్‌ భాయ్‌ను అన్‌బ్లాక్‌ చేయాల్సిందిగా కోరాడు.

వాళ్లు నన్నెప్పుడూ అన్‌బ్లాక్‌ చేయరు
ఇందుకు వార్నర్‌ బదులిస్తూ.. ‘‘వాళ్లు నన్నెప్పుడూ అన్‌బ్లాక్‌ చేయరు’’ అని పేర్కొన్నాడు. అంతేకాదు.. సన్‌రైజర్స్‌ పేజీలో తనను బ్లాక్‌ చేసినట్లుగా (ప్రైవేటు) ఉన్న స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు కూడా!.. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ యాజమాన్యం తీరుపై ఆరెంజ్‌ ఆర్మీ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఆరెంజ్‌ ఆర్మీ ఫైర్‌
‘‘వార్నర్‌ పట్ల ఇంత వివక్ష తగదు. మనకు తొలి టైటిల్‌ అందించిన కెప్టెన్‌కు మీరిచ్చే గౌరవం ఇదేనా?’’ అని ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం యాజమాన్యంతో అతడి ప్రవర్తనే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. కాగా 2014లో సన్‌రైజర్స్‌లో చేరిన వార్నర్‌.. 2015, 2017, 2019 సీజన్‌లలో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్నాడు.

చివరగా ఢిల్లీకి ఆడిన వార్నర్‌
ఇక ఐపీఎల్‌లో అత్యంత నిలకడైన ఆట తీరు కనబరిచే క్రికెటర్‌గా పేరొందిన వార్నర్‌.. 2016లో సారథిగా టైటిల్‌ కూడా గెలిచాడు. అయితే, 2021 సీజన్‌ నుంచి సన్‌రైజర్స్‌ యాజమాన్యం- ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ మధ్య దూరం పెరిగింది. విభేదాలు తారస్థాయికి చేరిన వేళ సన్‌రైజర్స్‌ అతడిని వదిలివేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు.

పాక్‌ లీగ్‌లో సారథిగా
అయితే, 2024 నుంచి ఐపీఎల్‌కు దూరమైన వార్నర్‌.. ఇటీవల పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కరాచీ కింగ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు తిరిగి రావాలని ఓ అభిమాని కోరగా.. ఇప్పుడు తనకు ఆ అవసరం లేదని ఈ ఆసీస్‌ స్టార్‌ కుండబద్దలు కొట్టాడు.

ఇదిలా ఉంటే.. మరో ఆసీస్‌ స్టార్‌ ప్యాట్‌ కమిన్స్‌ కెప్టెన్సీలో సన్‌రైజర్స్‌ అద్భుత రీతిలో ఆడుతోంది. 2024లో ఫైనల్‌ చేరిన జట్టు.. తాజాగా ఐపీఎల్‌-2026లో ప్లే ఆఫ్స్‌నకు దూసుకువెళ్లింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో బుధవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కమిన్స్‌ బృందం అమీతుమీ తేల్చుకుంటుంది.

చదవండి: అప్పుడేమో అలా.. ఇప్పుడు పశ్చాత్తాపం ఎందుకు?: సెహ్వాగ్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement