
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న తెలుగు టైటాన్స్‌కు పరాజయం ఎదురైంది. వైజాగ్ వేదికగా ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన తెలుగు టైటాన్స్ శనివారం 33–39 పాయింట్ల తేడాతో పుణేరి పల్టన్ చేతిలో ఓడింది. ఈ సీజన్‌లో టైటాన్స్‌కు ఇది మూడో పరాజయం. తెలుగు టైటాన్స్ తరఫున భరత్ 12 పాయింట్లతో విజృంభించగా... కెపె్టన్ విజయ్ మాలిక్ 7 పాయింట్లు సాధించాడు. పల్టన్ తరఫున అస్లమ్ ఇనామ్‌దార్, గౌరవ్ చెరో 7 పాయింట్లు సాధించారు.
విశాల్ భరద్వజ్ (6 పాయింట్లు), ఆదిత్య (5 పాయింట్లు), పంకజ్ (5 పాయింట్లు) కూడా మెరవడంతో పల్టన్ ముందంజ వేసింది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధించగా... పల్టన్ 15కే పరిమితమైంది. ట్యాక్లింగ్‌లో పల్టన్ 17 పాయింట్లు సాధిస్తే తెలుగు టైటాన్స్ పది పాయింట్లకే పరిమితమైన పరాజయం పాలైంది. లీగ్‌లో భాగంగా ఆరు మ్యాచ్‌లు ఆడిన టైటాన్స్ మూడింట గెలిచి మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడి 6 పాయింట్లతో పట్టిక నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 41–29 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌పై గెలుపొందింది. పింక్ పాంథర్స్ తరఫున నితిన్ కుమార్ 11 పాయింట్లు, అలీ సమది 10 పాయింట్లతో సత్తాచాటారు. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో యూపీ యోధాస్ 22 రెయిడ్ పాయింట్లు సాధించగా... జైపూర్ పింక్ పాంథర్స్ 21 సాధించింది. అయితే ట్యాక్లింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన పింక్ పాంథర్స్ 12 పాయింట్లు సాధిస్తే... యూపీ యోధాస్ 4 పాయింట్లకే పరిమితమైంది.