
గంభీర్-గిల్(ఫైల్ ఫోటో)
ఆసియాకప్-2025 కోసం టీమిండియా తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. దాదాపు నెల రోజుల విరామం తర్వాత భారత ఆటగాళ్లు తిరిగి మైదానంలో అడగుపెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఈ మల్టీ నేషనల్ టోర్నమెంట్ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత బృందం గురువారం రాత్రి దుబాయ్‌కు చేరుకున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం దుబాయ్‌లోని ఐసిసి అకాడమీలో టీమిండియా తమ తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోంది. హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఆధ్వర్యంలోనే భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
వాస్తవానికి బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ట్రైనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ యూఏఈ పరిస్థితులను అలవాటు పడేందుకు అక్కడకే వెళ్లి ట్రైనింగ్ క్యాంపును ఏర్పాటు చేయాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిచింది.
మరో మూడు రోజుల పాటు నెట్ ప్రాక్టీస్‌లో ఆటగాళ్లు బీజీబీజీగా గడపనున్నారు. అయితే యూఏఈ పరిస్థితులు భారత ఆటగాళ్లకు కొత్తేమి కాదు. ఈ ఏడాది ఆరంభంలో జట్టులో చాలా మంది ప్లేయర్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు. అంతకుముందు ఆ వేదికలపై ఆసియాకప్, ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం భారత ఆటగాళ్లకు ఉంది. ఈ టోర్నీలో భారత తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 9న యూఏఈతో తలపడనుంది.
కాగా ఈ ఖండాంత టోర్నీలో భారత జట్టు ప్రధాన స్పాన్సర్ లేకుండానే ఆడనుంది. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025కు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో డ్రీమ్ 11తో బీసీసీఐ ఒప్పందం రద్దు చేసుకుంది. దీంతో కొత్త స్పాన్సర్స్ కోసం బీసీసీఐ టెండర్లను ఆహ్వానించింది. ఐసీసీ ఆకాడమీలో భారత ఆటగాళ్లు జెర్సీపై స్పాన్సర్ లేకుండా ప్రాక్టీస్ చేశారు.
ఆసియాకప్-2025కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్. స్టాండ్‌బై ప్లేయర్లు: యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్.
భారత జట్టు షెడ్యూల్
భారత్ వర్సెస్ యుఏఈ - సెప్టెంబర్ 10,
భారత్ వర్సెస్ పాకిస్తాన్ - సెప్టెంబర్ 14,
భారత్ వర్సెస్ ఒమన్ - సెప్టెంబర్ 19